Wrestlers Protest: 5 గంటలు కేంద్ర మంత్రితో చర్చించి.. కీలక ప్రకటన చేసిన రెజ్లర్లు
సమావేశం ముగిశాక రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు.

Wrestlers Protest
Wrestlers protest – Anurag Thakur: రెజ్లర్లు జూన్ 15 వరకు ఆందోళన చేయబోమని ప్రకటించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను అరెస్టు చేయాలని రెజ్లర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఇవాళ వారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తో చర్చించారు.
సమావేశం ముగిశాక రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడుతూ… “జూన్ 15లోపు ఢిల్లీ పోలీసులు విచారణ పూర్తి చేయాలని ప్రతిపాదన ఉంచామని చెప్పారు. అప్పటివరకు ఆందోళనకు దిగబోము. జూన్ 15 తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటాం ” అని చెప్పారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ… ” జూన్ 15 లోపు విచారణ ముగుస్తుంది. ఛార్జిషీట్ దాఖలు చేస్తారు. రెజ్లింగ్ ఫెడరేషన్ స్వతంత్ర ఎన్నికలు జూన్ 30లోపు జరుగుతాయి” అని చెప్పారు. బ్రిజ్‌భూషణ్ పై దర్యాప్తు రిపోర్టు వచ్చే వరకు రెజ్లర్లు ఆగాలని కోరారు.
రెజ్లర్ల నిరసనపై కేంద్ర మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని ఇటీవల చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం, భారతీయ రైల్వేలో ఓఎస్డీగా సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ ఉద్యోగాల్లో చేరారు. రెజ్లర్ల పోరాటాన్ని మాత్రం విరమించబోమని ఇటీవలే చెప్పారు.