WTC Final 2023: పట్టుబిగిస్తున్న ఆస్ట్రేలియా.. ముగిసిన రెండో రోజు ఆట.. భారమంతా రహానే పైనే
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో క్రమంగా ఆస్ట్రేలియా(Australia) పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్(Team India) ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

Ajinkya Rahane
WTC Final:ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో క్రమంగా ఆస్ట్రేలియా(Australia) పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్(Team India) ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే(Ajinkya Rahane) 29, శ్రీకర్ భరత్(Srikar Bharat) 5 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(Mitchell Starc), పాట్ కమిన్స్(Pat Cummins), బొలాండ్(Scott Boland), కామెరూన్ గ్రీన్(Cameron Green), నాథన్ లియోన్(Nathan Lyon)లు తలా ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 318 పరుగులు వెనకబడి ఉంది. భారమంతా అజింక్యా రహానేపైనే ఉంది. మూడో రోజు అతడు ఎంతవరకు ఆదుకుంటాడో అన్నదానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంది.
టాప్-4 విఫలం
ఎన్నో అంచనాలతో మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ గట్టి షాకులే తగిలాయి. కెప్టెన్ రోహిత్ శర్మ(15) తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఎల్భీగా ఔట్ అయ్యాడు. ఆ తరువాతి ఓవర్‌లోనే ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన శుభ్‌మన్ గిల్(13)ను బొలాండో క్లీన్ బౌల్డ్ చేశాడు. 30 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్‌కు చేరుకున్నారు. నయావాల్ పుజారా(14), పరుగుల యంత్రం విరాట్ కోహ్లి(14)లు ఆదుకుంటారని బావించగా అలాంటిదేమీ జరగలేదు.
WTC Final 2023: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 ఆలౌట్
పుజారాను కామెరూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్ చేయగా, స్టార్క్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే, రవీంద్ర జడేజా(48) లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. జడేజా ధాటిగా ఆడగా రహానే తనదైన శైలిలో పరుగులు రాబట్టారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అర్ధశతకానికి రెండు పరుగుల దూరంలో నాథన్ లియోన్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ అందుకోవడంతో జడేజా ఔట్ అయ్యాడు. శ్రీకర్ భరత్‌తో కలిసి రహానే మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469 ఆలౌట్
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 327/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లను కోల్పోయింది. ట్రావిస్ హెడ్(163; 174 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్) స్టీవ్ స్మిత్(121; 268 బంతుల్లో 19 ఫోర్లు) శతకాలతో దుమ్ములేపారు. అలెక్స్ కేరీ (48; 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) , డేవిడ్ వార్నర్ (43; 60బంతుల్లో 8 ఫోర్లు) రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలరల్లో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా, షమీ, శార్దూల్ చెరో రెండు వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.