Yashasvi Jaiswal: బట్లర్ రనౌట్ పై యశస్వి జైశ్వాల్ ఏమన్నాడో తెలుసా..!

తన ఓపెనింగ్ పార్టనర్ జోస్ బట్లర్ రనౌట్ గురించి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ తనదైన శైలిలో స్పందించాడు.

Yashasvi Jaiswal: బట్లర్ రనౌట్ పై యశస్వి జైశ్వాల్ ఏమన్నాడో తెలుసా..!

య‌శ‌స్వి జైశ్వాల్‌ (Photo: @rajasthanroyals)

Yashasvi Jaiswal Fastest Fifty: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్, యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ పరుగుల వరద పారిస్తూ.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (IPL) 2023 సీజ‌న్‌లో దూసుకుపోతున్నాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) తో గురువారం జరిగిన మ్యాచ్ లో యశస్వి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. తానాడిన తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థి జట్టుపై వీర విహారం చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ (fastest fifty) సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది సరికొత్త రికార్డు లిఖించాడు.

తొందరగా ఫినిష్ చేయాలనుకున్నా
ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించిన యశస్వి జైశ్వాల్ 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అయితే జట్టు విజయమే తనకు ముఖ్యమని, సెంచరీ చేయకపోవడం పట్ల పెద్దగా బాధ లేదని అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. “నెట్ రన్ రేట్ గురించి మాత్రమే నేను ఆలోచించాను. నేను, సంజూ భాయ్ ఆటను త్వరగా ముగించడం గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. విన్నింగ్ షాట్ కొట్టడం చాలా గొప్పగా అనిపించింది. మ్యాచ్ తొందరగా ఫినిష్ చేయాలనుకున్నాను. మంచి రన్ రేట్ తో మ్యాచ్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగామ”ని యశస్వి తెలిపాడు.

అవన్నీ ఆటలో భాగమే..
తన ఓపెనింగ్ పార్టనర్ జోస్ బట్లర్ రనౌట్ గురించి మాట్లాడుతూ.. “దీన్ని ఆటలో భాగంగానే చూడాలి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. బట్లర్ రనౌట్ అయిన తర్వాత నా బాధ్యత మరింత పెరిగింది. నీ ఆట నువ్వు ఆడు, ఆ రనౌట్ గురించి ఆలోచించవద్దని సంజూ భాయ్ నాకు భరోసాయిచ్చాడు. ఐపీఎల్ లో దిగ్గజ క్రికెటర్ల ముందు ఆడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువ ఆటగాళ్లు తమ టాలెంట్ చూపించే వేదికగా ఐపీఎల్ ఉపయోగపడుతోంద”ని అన్నాడు.

Also Read: దంచికొట్టిన జైస్వాల్‌.. కోల్‌క‌తాపై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స‌ర్లతో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 13.1 ఓవర్లలోనే విజయం సాధించడంతో నెట్ రన్ రేట్ గణనీయంగా మెరుగుపడింది. +0.633 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి రాజస్థాన్ రాయల్స్ ఎగబాకింది. గుజరాత్, చెన్నై మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.