sri sarvari nama ugadi

శ్రీ శార్వరి నామ ఉగాది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మనం ఈ రోజు వికారి నామ సంవత్సరంలోంచి శ్రీశార్వరి నామ సంవత్సరంలోకి అడుగిడుతున్నాము.  ‘ఉగాది’ అన్న తెలుగుమాట ‘యుగాది’ అన్న సంస్కృత పద వికృతి రూపం. ఉగస్య ఆది అనేదే ఉగాది. “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు.  వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది.

ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది. ఉగాది  – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.

బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. దీనికి ఆధారం వేదాలను అధారం చేసుకొని వ్రాయబడిన ‘సూర్య సిద్ధాంతం’ అనే ఖగోళ జ్యోతిష గ్రంథం. బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం లో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారమే.

ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.

ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.]

నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీశార్వరి అని పేరు. కాళరాత్రి అని, శుభకరి అని, చంద్రకాంత అని, హిమం అనీ, పంటలు బాగా పండేదనీ అనేక అర్థాలున్నాయి ఈ పదానికి. అంతేకాదు… శ్రీ శార్వరి అనేది అమ్మవారి నామాలలో ఒకటి. అమ్మవారి ముఖం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి పసుపు పూసుకునేది మన సంప్రదాయం ప్రకారం సుమంగళి కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు మెరుగవుతాయనీ, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో ఉంటారనీ ఆశిద్దాం.

ఇక పోతే ఉగాది పర్వదినం మార్చి 25 బుధవారం. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛైత్ర శుద్ధ పాడ్యమి మొదలైనా పండగ మాత్రం బుధవారం జరుపుకోవాలి. ఎందుకంటే శాస్త్రోక్తంగా సూర్యోదయం సమయంలో తిథి ప్రకారం పండుగ జరుపుతారు.  ప్రతి సంవత్సరంలా కాకుండా.. ఈ ఏడాది కరోనా దెబ్బకు ప్రజలు  ఏ ఆలయానికి వెళ్లలేని పరిస్థితి. సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటూ ఉగాది చేసుకోవాలి.

Related Tags :

Related Posts :