మాధవ్, పురంధరేశ్వరిని కాదని సోమువీర్రాజుకే ఎందుకు పట్టం కట్టారు? వైసీపీ ఎందుకు ఖుషీగా ఉంది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనూహ్యంగా జరిగిపోయింది. అధ్యక్షుడి మార్పు ఖాయమని ప్రచారమున్నా.. సోము వీర్రాజు అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. హైకమాండ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అధ్యక్ష బాధ్యతల్ని సోము వీర్రాజుకి అప్పగించింది. బీసీ నేతకు ఛాన్స్ ఇస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పురంధరేశ్వరిలో ఎవరో ఒకరు చీఫ్ అవతారని లెక్కలేసుకున్నారంతా. కమలం గూటికి చేరిన వలస నేతలు కూడా అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. కానీ హైకమాండ్‌ మాత్రం పార్టీకి వీర విధేయుడిగా ఉన్న సోమ వీర్రాజుకే పట్టం కట్టింది.కన్నా ఎంట్రీతో చాన్స్ మిస్:
నిజానికి గతంలోనే సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాల్సింది. అనుకోకుండా కాంగ్రెస్‌ నుంచి కమలంలోకి కన్నా ఎంట్రీతో తృటిలో చేజారిపోయింది. గతంలో బీజేపీని చంద్రబాబు వ్యతిరేకించిన ప్రతీ సందర్భంలోనూ సోము వీర్రాజు కౌంటర్ మీద కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై విమర్శలు చేస్తేనే ఊరుకునేది లేదంటూ గట్టిగానే బదులిచ్చారు. ఆ తెగువే ఇప్పుడు సోము వీర్రాజుకి కలిసొచ్చింది. గతంలో చేజారిపోయిన అధ్యక్ష పీఠం.. ఈసారి వరించేలా చేసింది.

గవర్నర్‌కు కన్నా లేఖపై అధిష్టానం సీరియస్:
తెలుగురాష్ట్రాలకు ఒకేసారి అధ్యక్షుడి మార్పు జరుగుతుందనే ప్రచారం జరిగింది. తెలంగాణకు బండి సంజయ్‌ని ఎంపిక చేసిన అధిష్టానం.. ఏపీలో మాత్రం పెండింగ్‌లో పెట్టింది. పలు రాజకీయ కారణాలతో కన్నాను పొడిగించాల్సి వచ్చింది. మూడు రాజధానుల అంశం, ఇసుక కొరతలాంటి అంశాలపై బీజేపీ పోరాటం తీవ్రం చేసింది. ఈ సమయంలో అధ్యక్షుడి మార్పు సరికాదని భావించి.. కన్నాను కంటిన్యూ చేసింది. ఈ మధ్య వికేంద్రకరణ, సీఆర్డీఏ బిల్లుల్ని ఆమోదించవద్దంటూ గవర్నర్‌కి కన్నా లేఖ రాయడాన్ని అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. ఈ పరిణామమే ఉన్నపళంగా కన్నాను బాధ్యతల నుంచి దూరం చేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అధికార పక్షానికి ధీటైన జవాబిస్తాడని నమ్మకం:
కొత్త అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకే ఓటేసింది బీజేపీ అధిష్టానం. మాటల తూటాలు పేల్చడం, అవతలి వాళ్లను ఇరుకున పెట్టడంలో సోము వీర్రాజు దిట్ట. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తాడనే ఉద్దేశంతోనే ఆయనపై అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. టీడీపీ హయాంలో ఫైర్ బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వీర్రాజు.. ఇప్పుడు అంతకుమించి పనిచేస్తాడని నమ్మకంతో ఉంది. కేంద్రంతో సఖ్యతతోనే ఉంటున్న వైసీపీని వీర్రాజు ఎలా ఎదుర్కోబోతున్నారు..? ఎలాంటి వ్యూహాలతో ప్రభుత్వాన్ని కౌంటర్‌ చేస్తారు..? ప్రజల చెంతకు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడన్నది వీర్రాజు ముందున్న సవాళ్లు.

వీర్రాజు నియామకంతో ఆనందంలో వైసీపీ:
జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని కన్నా వ్యతిరేకిస్తూ వచ్చారు. లేఖలతో పదే పదే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడాయన స్థానంలో వీర్రాజు ఎంటరయ్యారు. ఇది ఓ రకంగా తమకు కలిసొస్తుందని భావిస్తోంది వైసీపీ. కన్నాతో పోలిస్తే తమ విషయంలో వీర్రాజు ఆచితూచి మాట్లాడతారని.. అంతలా ఇబ్బందికరంగా మారడని భావిస్తున్నారు. సోము వీర్రాజు కూడా వస్తూ వస్తూనే టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పోలవరం పూర్తికాకుంటే చంద్రబాబే కారణమని ఆరోపించారు. టీడీపీతో మళ్లీ కలిసే ఛాన్స్ లేదని తేల్చి చెప్పిన సోము.. వైసీపీతోనూ అంతే దూరం పాటిస్తామన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఏపీ బీజేపీకి కొత్త సారథి వచ్చేశారు. ఇక ప్రభుత్వంపై వీర్రాజు పోరాటం ఎలా చేస్తారు..? కమల వికాసం కోసం ఎలాంటి స్కెచ్‌లు వేస్తారో చూడాలి.

READ  ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదంRelated Posts