సుజనా ప్లాన్ ఫెయిల్.. కూల్‌గా కలుపుకుపోతున్న సోము వీర్రాజు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన ఆ నలుగురు నేతలు.. వారిలో ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది…. బీజేపీ కార్యక్రమాలకి ఎక్కువగా హాజరయ్యేది సుజనా చౌదరి మాత్రమే. మిగతా ముగ్గురు అంతగా వార్తల్లో నిలిచే వ్యక్తులు కారు. టీడీపీ నుంచి వెళ్లిన తర్వాత సుజనా చౌదరి బీజేపీలో బాగానే యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా రాజధాని విషయంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తర్వాత అంత పెద్ద ఎత్తున పోరాటం చేసింది కూడా సుజనా చౌదరి మాత్రమే.

అమరావతి విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని పదే పదే చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీలో సుజనా చౌదరి ఒక్కరే. అలాంటిది ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం రాజధాని విషయంలో ఢిల్లీ వెళ్లి కేంద్రానికి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత కూడా సుజనా చౌదరి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి అమరావతి రాజధానికి కేంద్రం నిధులిచ్చిందని కాబట్టి ఈ విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని తెలిపారు.

అప్పుడే బీజేపీ ట్విటర్ వేదికగా సుజనాచౌదరి వ్యాఖ్యల్ని ఖండించింది. రాజధాని అమరావతిలో కొనసాగింపు, రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని సోము వీర్రాజు వివరణ ఇచ్చారని ఏపీ బీజేపీ తెలిపింది. ఆ తర్వాత సుజనా చౌదరి ఇంత వరకు మీడియా ముందుకు రాలేదు. సోము వీర్రాజు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలందరినీ కలిసిన సంగతి మనకి తెలిసిందే.

అందులో భాగంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో పాటు సుజనా చౌదరి, పురంధేశ్వరిలని కూడా సోము వీర్రాజు కలిశాడు. పార్టీలో అందర్నీ కలుపుకొనిపోవాలన్న సిద్ధాంతంతో సోము వీర్రాజు ముందుకెళ్తుంటే సుజనా చౌదరి మాత్రం కాస్త ఎడమొహంగానే ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని విషయంలో ఎంతో ఊహించిన సుజనాకి కేంద్రం ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే సైలెంట్ అయినట్టు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకపోవడం ఇదే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

బీజేపీలో కీలకంగా మారదామని, చక్రం తిప్పుదామని వచ్చిన సుజనా చౌదరిని ఓ వర్గం అసలు పట్టించుకోకపోవడంతో ఆయన ఫీలవుతున్నారట. ఆ తర్వాత రాజధాని విషయంలో కేంద్ర జోక్యం ఉంటుందని రైతులకి చెప్పి, ఇప్పుడు అది జరగకపోవడంతో భంగపాటుకు గురైన సుజనాకి ఏం చేయాలో పాలుపోవడం లేదట. అందుకే కొన్నాళ్ల పాటు సైలెంట్‌గానే ఉంటే బెటర్ అని భావిస్తున్నట్టు సుజనా సన్నిహితులు చెబుతున్నారు.

Related Tags :

Related Posts :