Categories
Andhrapradesh Latest Slider

BIG BREAKING : నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టివేత

ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాకే తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్  తొలగింపు ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. రమేశ్ కుమార్ ను తిరిగి నియమించాలని ఆదేశం జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిపై దాఖలైన పిటిషన్లపై 2020, మే 29వ తేదీ శుక్రవారం తీర్పును వెలువరించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల కమిషనర్‌ నియామకంలో నిబంధనల మార్పు కుదరదని, ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

Read: కర్నూల్‌లో ఆసుపత్రి నుంచి పరారైన కరోనా రోగి.. బస్సెక్కి!

Categories
Political

ఆశీర్వదించండి…అమిత్ షా,నడ్డాని కలిసిన బండి సంజయ్

కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమిత్ షా,నడ్డాని కలిసే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ వెంట ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ బుధవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బండి సంజయ్ కు అమిత్ షా,నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల నడ్డాకు,అమిత్ షాకు సంజయ్ కూడా కృతజ్ణతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్ ఏబీవీబీ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది.

Categories
Political Telangana

‘బండి’కి తెలంగాణ బీజేపీ పగ్గాలు

తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం బుధవారం(మార్చి-11,2020) ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన సంజయ్‌ కుమార్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ కొనసాగిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి.

పార్టీ అధిష్ఠానం నుంచి పరిశీలకులు అనీల్ జైన్ తదితరులు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఈసారి కూడా లక్ష్మణ్‌నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న ప్రచారమూ సాగింది. వివిధ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఖరారు చేశారు. బండి సంజయ్ ఏబీవీబీ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది.

See Also | మధ్యప్రదేశ్ లో మారిన రాజకీయం…బీజేపీకి షాక్ ఇచ్చిన 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

Categories
Uncategorized

మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన సీఎం జగన్‌ కు సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

sanchaita

విద్యా అభివృద్ధి ధ్యేయంగా మాన్సాస్‌ ఆవిర్భావం
1958 సంవత్సరంలో దివంగత పివిజి రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958సంవత్సరంలో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994 సంవత్సరంలో పివిజి రాజు మరణం చెందిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అశోక్‌ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌గా తెరపైకి వచ్చారు. 13వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్‌ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఇప్పటి వరకూ ఉన్నారు. బుధవారం ఉదయం సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానానికి వెళ్లి ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమెకు ఘనత దక్కింది.

mansas

ఎమ్మెల్యే కోలగట్లతో సంచయిత గజపతిరాజు భేటీ
సింహాచలం నుంచి సంచయిత గజపతిరాజు నేరుగా విజయనగరం చేరుకుని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ నాయకులతో మాట్లాడారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన నాయకుడు ఈశ్వర్‌ కౌశిక్‌తో కలిసి విజయనగరం కోటలోని మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పివిజి రాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి మాన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలను చైర్‌పర్సన్‌ హోదాలో స్వీకరించారు. త్వరలోనే ట్రస్ట్‌ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించి, అన్ని విషయాలపై చర్చిస్తామని సంచయిత గజపతిరాజు స్పష్టం చేశారు.

sanchaita meeting

పూసపాటి వంశీయురాలిగా  
సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్లుగా పూసపాటి వంశీయులే కొనసాగుతున్నారు. గతంలో పూసపాటి ఆనందగజపతి రాజు ఉన్నప్పుడు ఆయనే ధర్మకర్తగా ఉండేవారు. ఆయన మరణం తరువాత సోదరుడైన అశోక్‌ గజపతి బాధ్యతలు తీసుకుని నేటి వరకూ కొనసాగారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులను నియమించింది. విజయనగరం జిల్లాకు చెందిన వారికి దానిలో ప్రాతినిధ్యం కల్పించింది. ఆనంద గజపతి రాజు, అశోక్‌ గజపతి రాజు అన్నదమ్ములైనప్పటికీ రాజకీయంగా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండేది. గజపతి రాజు అశోక్‌ టీడీపీలో ఉంటే ఆనంద గజపతి కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు.

gajapatiraja 

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన సంచయిత గజపతి  
ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజు ఢిల్లీలో స్థిర నివాసం అయినప్పటికీ విశాఖ ఏజెన్సీలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్ధ్యం, తాగునీటి రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థలకు ఇచ్చే గూగుల్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌ చాలెంజ్‌ అవార్డును 2013లో సాధించారు. ఆ విజయంతో వచ్చిన రూ.3 కోట్లను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇరవై గ్రామాలు, మరో ఇరవై స్కూళ్లకు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్‌ ఇటీవల తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సంచయిత గజపతి స్వాగతించారు. విజయనగరం గడ్డపై పుట్టిన సంచయిత చెన్నై, కేరళ, ఢిల్లీలో పెరిగి ఇప్పుడు సొంత గడ్డమీద బృహత్తర బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు.

mansas  

See Also | ఇది బజారు కాదు…విపక్ష సభ్యులపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం

Categories
National Political

ఎవరీ సుభాష్ చంద్ర గార్గ్.. సీఎం జగన్ ఆయననే ఎందుకు సెలెక్ట్ చేశారు

ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ప్రభుత్వం గార్గ్ ను నియమించింది. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం ఆర్థిక సలహాదారుగా అపాయింట్ అయిన సుభాష్ చంద్ర గార్గ్ గురించి అంతా ఆరా తీస్తున్నారు. అసలు ఎవరీ గార్గ్? సీఎం జగన్ ఏరికోరి మరీ ఆయననే ఎందుకు అపాయింట్ చేశారు? గార్గ్ అనుభవం ఏంటి? సీఎం జగన్ నమ్మకాన్ని ఆయన నిలుపుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

* సుభాష్ చంద్ర గార్గ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
* రాజస్థాన్‌ కేడర్-1983 బ్యాచ్ అధికారి
* ఇటీవలే వీఆర్ఎస్(voluntary retirement scheme) తీసుకున్నారు
* వీఆర్ఎస్ తీసుకున్న కొన్ని నెలలకే సీఎం జగన్ ఆర్థిక సలహాదారుగా నియామకం
* ప్రధాని మోడీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికశాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పని చేశారు
* ఎర్లీగానే రిటైర్మెంట్ తీసుకున్నారు

* 2019లో జులైలో కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత రిటైర్మెంట్
* ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా పని చేశారు
* నోట్ల రద్దు నిర్ణయంలో కీ రోల్
* విద్యుత్ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు
* బదిలీకి ముందే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న గార్గ్
* ఆర్థిక సంస్కరణలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన గార్గ్
* బడ్జెట్ రూపకల్పనలో గార్గ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు

* సార్వభౌమ బాండ్లను విక్రయించడం ద్వారా 10 బిలియన్ డాలర్లను సేకరించొచ్చని బడ్జెట్ లో వచ్చిన ప్రతిపాదనను సూచించింది గార్గ్
* ఈ ప్రతిపాదనను ఆర్బీఐ మాజీ గవర్నర్ సహా పలువురు మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు
* బిమల్ జలన్ ప్యానెల్ సభ్యులతో విభేదాలు
* వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వెంటనే.. ఆమోదించాలని కోరిన గార్గ్

సీఎం జగన్ కు ఇప్పటికే అనేక మంది సలహాదారులు ఉన్నారు. మీడియాతో పాటు అనేక రంగాల్లో అడ్వైజర్లను నియమించుకున్నారు. ఇప్పుడు ఇంకో సలహాదారు వచ్చారు. మరో అడ్వైజర్ తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు… ప్రభుత్వం.. పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడం చాలా అవసరం.

See Also | గాలివారి పెళ్లి కంటే ఘనంగా: ఖర్చు రూ.600కోట్లు!
 
ఆ కసరత్తులో భాగంగానే సీఎం జగన్ ఈ తాజా నియామకం చేసినట్టు అర్థమవుతోంది. ఈ కొత్త సలహాదారు నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. గతంలో గార్గ్ చేసిన పదవులు, ఆయన అనుభవం.. నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. మరి సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని గార్గ్ ఏ మేరకు నిలుపుకుంటారో చూడాలి.

Categories
International National

బ్రిటన్ ఆర్థికమంత్రిగా నియమితులైన ఇన్ఫోసిస్ నారాయణ అల్లుడు

బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యారు. గతేడాది జులై నుంచి ట్రెజరరీ చీఫ్ గా పనిచేస్తున్న 39ఏళ్ల రిషి సునక్ ను ఆర్థికశాఖమంత్రిగా నియమించారు ప్రధాని బోరిస్ జాన్సన్. నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ ఎంపీ విలియం హేగ్ దిగిపోతున్నట్టు 2014లో ప్రకటించారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ తమ అభ్యర్థిగా సునక్‌‌ను బరిలో దింపింది. 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా  అప్పటి ప్రధానమంత్రి థెరిసా మే నిర్ణయానికి రిషి మద్దతు పలికారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతున్నట్టు ప్రకటించడంతో కొత్త ప్రధానిగా జాన్సన్‌కు జై కొట్టారు. 

రిషి సునక్ తండ్రి డాక్టర్, ఫార్మాసిస్ట్. 2009లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ (PPE) చదువుకున్నారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అక్షతతో ఆయనకు స్టాన్‌ఫర్డ్‌లోనే పరిచయం ఏర్పడింది.

ప్రస్తుతం రిచ్ మండ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రిషి సునక్…రాజకీయాల్లోకి రాకముందు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ ఓ డైరెక్టర్.

 

Categories
Uncategorized

ఇసుక, మద్యం అక్రమ రవాణాకు చెక్ : అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారుల నియామకం

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. స్పెషల్ పోలీసు ఆఫీసర్ల నియామకానికి రాష్ట్ర హోంశాఖ అర్హతలు ఖరారు చేసింది. మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ పారా మిలటరీ సిబ్బందికి అవకాశం ఇచ్చింది. మాజీ పోలీసు అధికారులు, మాజీ, ప్రస్తుత హోంగార్డులకు అవకాశం ఇచ్చింది.

అయితే 65 ఏళ్ల లోపు వయసు ఉండాలని నిబంధన పెట్టారు. పరీక్షల ద్వారా నియమించాలని సూచించింది. కానిస్టేబుల్ లేదా సమానమైన ర్యాంక్ లో పని చేసి ఉండాలని నిబంధన పెట్టారు. క్రిమినల్ కేసులు లేకుండా కెరీర్ లో శాఖాపరమైన చర్యలకు గురికాడదన్నారు. చెక్ పోస్టులు, మొబైల్ పార్టీల్లో ఉంటూ రెగ్యులర్ పోలీసులకు సాయం చేయాలన్నారు. ఏడాది కాలానికి నియామకం చేస్తున్నట్లు.. అనంతరం పనితీరును బట్టి రెన్యూవల్ చేస్తామని తెలిపింది. 

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై పోలీసులు శాఖ ఎంతగా నిఘా పెట్టినా అక్రమమార్గాల్లో ఇసుక, మద్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమ రవాణాలపై మరింత నిఘా పెట్టాలని సీఎం జగన్ భావించారు. స్మగ్లర్ల పని పట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టక్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లోనూ చెక్ పోస్టులు పటిష్టంగా పని చేయాలని ఈ విషయంలో కలెక్టర్లు పూర్తి బాద్యత తీసుకుని, అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.

దొరికినవారు ఎంతటి వారైనా వదలొద్దని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో చెక్‌పోస్టుల పనితీరును క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వ్యక్తిగతంగా పర్యటించాలని ప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు గనులు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటుకు గతంలోనే సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. 

ప్రతి చెక్‌పోస్టు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి సీసీ పుటేజ్ ను భద్రపరిచి.. నిర్లక్ష్యం, అవినీతి తావు లేకుండా చేయాలన్నారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాదారుల పని పట్టాలని గతంలోనే సీఎం జగన్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 
 

Categories
National

కొత్త ఆర్మీ చీఫ్ ఈయనే

భారత ఆర్మీ నూతన చీఫ్ గా జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే ఎంపికయ్యారు. మంగళవారం(డిసెంబర్-31,2019)జనరల్ మనోజ్ ముకుంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2016 డిసెంబర్-31న 27వ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మంగళవారం రిటైర్డ్ అవుతున్న సమయంలో నూతన ఆర్మీ చీఫ్ గా మనోజో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1.3మిలియన్ల శక్తివంతమైన ఫోర్స్ ని లీడ్ చేసే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్ పేరును ఇప్పటికే కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 

తనను ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేయడం పట్ట మనోజ్ ముకుంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను ఇవ్వడం గౌరవంగా ఉందని అన్నారు. నూతన ఆర్మీ చీఫ్ గా నియమితులైన జనరల్ మనోజ్ ముకుంద్…తన 37 సంవత్సరాల సర్వీసులో వివిధ బాధ్యతలను నిర్వహించారు. శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో కూడా మనోజ్ ముకుంద్ ఒకడిగా ఉన్నారు. 

మహారాష్ట్రకు చెందిన మనోజ్ ముకుంద్ మయన్మార్ లోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లు భారత డిఫెన్స్ అటాచీగా కూడా పనిచేశారు. సెప్టెంబరులో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు..ఆర్మీ తూర్పు కమాండ్ కు నాయకత్వం వహించారు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్.  ఇది చైనాతో భారతదేశం యొక్క దాదాపు 4,000 కిలోమీటర్ల సరిహద్దును చూసుకుంటుంది.
 

Categories
National

నూతన CJIగా నియమితులైన జస్టిస్ బోబ్డే

నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బోబ్డే నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బోబ్డేను 47వ సీజేఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్-18,2019న ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్పీకరిస్తారు. ప్రస్థుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ అక్టోబర్ 3, 2018న బాధ్యతలు చేపట్టగా, నవంబర్ 17, 2019న రిటైర్డ్ కానున్న విషయం తెలిసింది. తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు గొగయ్ ఇటీవల లేఖ రాశారు. 

 కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలి సిందే. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్‌ గొగోయ్‌ తర్వాత శరద్‌ అరవింద్‌ సీనియర్‌గా ఉన్నారు.ఈ సమయంలో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమించబడ్డారు. 2021 ఏప్రిల్ లో బోబ్డే రిటైర్డ్ కానున్నారు. 18నెలల పాటు సీజేఐగా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.

1956,ఏప్రిల్ 24,1956లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జన్మించిన ఎస్ ఏ బోబ్డే 2000సంవత్సంలో బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా చేరారు.2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013ఏప్రిల్ లో ఆయన సుప్రీంకోర్టుకి బదిలీ అయ్యారు. అయోధ్య భూ వివాదం,బీసీసీఐ,ఫైర్ క్రాకర్స్ కి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ల వంటి పలు ముఖ్య కేసుల్లో ఆయన విచారణ చేపట్టినవారిలో ఉన్నారు.

Categories
National

బ్రేకింగ్ : జమ్మూకశ్మీర్,లఢఖ్ కు కొత్త గవర్నర్లు నియామకం

జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్‌ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్‌గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్‌ శ్రీ సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేశారు. లఢఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా శ్రీ రాధాకృష్ణ మథుర్ ని నియమించారు. మిజోరాం‌మ్‌కు గవర్నర్‌ గా శ్రీధరన్ పిళ్లైని నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.

జమ్మూకశ్మీర్ కు కొత్త గవర్నర్ గా నియమితులైన గిరీశ్ చంద్ర ముర్మూ… ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. లడఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా నియమితులైన రాధాకృష్ణ మథుర్.. త్రిపుర కేడర్ కు చెందిన 1977 బ్యాచ్ IAS ఆఫీసర్. త్రిపుర చీఫ్ సెక్రటరీగా మథుర్ పనిచేశారు. ఢిఫెన్స్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. 2018లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CIC)నుంచి రిటైర్ట్ అయ్యారు.

ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విసయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లఢఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా పునర్విభజన చేశారు. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్,లఢఖ్ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారంగా అమలులోకి వస్తాయి.