Categories
National

“పద్మశ్రీ” తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించిన అరిభమ్

పౌరసత్వ సవరణ  బిల్లుకు నిరసనగా 2006లో  తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని  ప్రముఖ మణిపురీ  డైరక్టర్ అరిభమ్ శ్యామ్ శర్మ ఆదివారం(ఫిబ్రవరి-3,2019) సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి నిర్దేశించిందే పౌరసత్వ సవరణ బిల్లు.

ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆదివారం అరిభమ్ మాట్లాడుతూ..బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు తెలియజేస్తున్న నిరసనకు మద్దతుగా తన పద్మశ్రీ వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లు-2016 ఈశాన్య రాష్ట్రాలు, మణిపూర్ స్థానికుల ప్రయోజనాలకు వ్యతిరేకమైనదని తెలిపారు. మణిపూర్ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈశాన్య భారత ప్రజలు ఏదైనా ప్రతిపాదించినప్పుడు కేంద్రం పరిగణలోకి తీసుకోవాలన్నారు.  

లోక్ సభలో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండటంతో రాష్ట్ర ప్రజల గళం వినిపించే అవకాశం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం చిన్నదైనా, పెద్దదైనా ప్రజల మనోభావాలను గౌరవించాలని తెలిపారు.
మణిపురీ సినిమారంగానికి అందించిన సేవలకుగాను 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అరిభమ్ శ్యామ్ శర్మ పద్మశ్రీని అందుకున్నారు.