Categories
Movies

సరిలేరు నీకెవ్వరు రివ్యూ

శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, మహర్షిలతో వరుస  మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నమహేష్.. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతి రేసులోకొ ఇవాళ(11 జనవరి 2020) వచ్చింది. ఈ సినిమా ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ధాం..

సినిమా కథ విషయానికి వస్తే.. కాశ్మీర్ లో ఉగ్రవాదులు కొందరు స్కూలు విద్యార్ధులను  కిడ్నాప్ చేసి కోర్కెలు కోరతారు. వారి కోర్కెలు తీర్చాల్సిన అవసరం లేదని పిల్లల్ని విడిపించే బాధ్యత తన భుజాన వేసుకున్న ఓ మేజర్ తన టీమ్ తో వెళ్తాడు. ఆ ఆపరేషన్ లో ఒక సోల్జర్ తీవ్రంగా గాయపడతాడు. ఒక వైపు ఊళ్లో అతని చెల్లి పెళ్లి. మరో వైపు అతను ట్రీట్మెంటు లో ఉంటాడు. ఆ సోల్జర్ తల్లికి ఇద్దరు కొడుకులు. ఇద్దరినీ ఆర్మీకి పంపిస్తుంది ఆవిడ. ఆ ఇద్దరిలో ఒకరు అప్పటికే మరణిస్తారు. ఇప్పుడు రెండో కొడుకు ఆపస్మారక స్థితిలో ఉంటాడు. ముందు దేశం తర్వాతే తాను అని భావించే  మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ భారతి  కొడుకు ఆ సోల్జర్. ఒక తప్పును అడ్డుకోడానికి ఎంత వరకైనా వెళ్లడానికి సిద్దపడే మనో స్థైర్యం నిజాయితీ పుష్కలంగా ఉన్న వ్యక్తి భారతి.

మానవ విలువలకు ప్రాధాన్యత ఇచ్చి … ఆ గాయపడిన సోల్జర్ చెల్లెలి  పెళ్లి జరిపించడానికి  మేజర్ అజయ్  తన టీమ్ మెంబర్ అయిన ఓ ఏజ్డ్ సోల్జర్ ను తీసుకుని బయల్దేరతాడు. ఆ మేజర్ ఆ పెళ్లి ఎలా జరిపించాడు అనేదే కథ.ఈ జర్నీలో అతనికో అమ్మాయి పరిచయం అవుతుంది . ఫైనల్ గా ఆ అమ్మాయితోనే తన జీవితం ముడిపడుతుంది. ఈ జర్నీలోనే ఓ క్రూకెడ్ పొలిటికల్ విలన్ తగుల్తాడు. అతనికెలా బుద్ది చెప్పాడు … అనేది మొత్తం తెరపై చూడాల్సిందే..

నటీనటుల విషయానికి వస్తే….  శ్రీమంతుడు నుంచి ఒక రకమైన మూస కథలకు అలవాటు పడిన మహేష్ బాబు… ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. హీరో ఇజాన్ని బాగా ప్రజెంట్ చేసే డైరెక్ట్  అనిల్ రావిపూడి… మహేష్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఒక కొత్త రకమైన పాజిటివ్ ఫీల్ కలిగింది. దానికి తగ్గట్టే మహేష్ బాబు కూడా తన ఎనర్జీని మరోసారి ఫుల్ గా స్క్రీన్ పై పరి చేశాడు.యాక్షన్ బ్లాక్ లో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నడు మహేష్… హీరోలను ఎలివెట్ చేసే కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దొరకడంతో అతను రాసుకున్న సీన్స్ లో ఆ రెంజ్ హీరోయిజం వుండడం తో వాటిని మరింత ఎలీవెట్ చేస్తూ మహేష్ చెలరేగిపోయాడు. ఆరడుగుల కటౌట్ స్క్రీన్ పై హల్ చల్ చేస్తే ఎలా వుంటుందో ఈ సినిమా లో మహేష్ నటన అలా వుంది. కామెడీ టైమింగ్ లో మహేష్ తన కున్న ప్రత్యేకతను మరోసారి కొనసాగించాడు.

ఇక విజయశాంతి  ఈ సినిమా ఎందుకు చేశారో చూస్తే అర్థమవుతుంది. 13 ఏళ్ల తర్వాత తన రీఎంట్రీ ఎలాంటి రోల్ తో చేస్తే బాగుంటుందని విశ్వసించారో అలాంటి పాత్రే విజయశాంతి ఇంటి తలుపులు తట్టింది. దేశం కోసం ఇద్దరు సైనికులను ఇచ్చిన తల్లిగా, తప్పును తప్పని నిక్కచ్చిగా చెప్పే ప్రొఫెసర్ భారతి పాత్రలో నటించి నాటి రోజులను గుర్తుచేసింది.నిబద్దత కలిగిన ప్రొఫెసర్ పాత్రలో స్థాయిగల నటిగా తానేమిటో నిరూపించుకునే అవకాశం దొరికింది. ఆవిడ దాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

అలాగే ప్రకాశ్ రాజ్ మరోసారి తనలోని విలనిజాన్ని బయపెట్టి పోకిరిని గుర్తుచేశాడు. చాలా కాలం తర్వాత ఓ పవర్ ఫుల్ విలన్ గా ప్రకాశ్ రాజ్ కొత్తగా అనిపించాడు. రాజేంద్రప్రసాద్ తనదైన మార్కు చూపించారు. విలన్ ట్రూపు నుంచీ అజయ్, జయప్రకాశ్ రెడ్డి కల్సి అద్భుతమైన ఎంటర్ టైన్మెంట్ అందించారు. ఇక హీరోయిన్ గా రష్మికకు మహేష్ బాబు పక్కన చేసే ఛాన్స్ రావడంతో.. ఆమె కూడా ఈ అవకాశాన్ని బాగా యూస్ చేసుకుంది. క్యూట్ పెర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుంది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించని సంగీత, తన కామెడీ టైమింగ్ తో అలరించింది. ఇక రావు రమేష్ అండ్ కో అంతా సినిమా ఆసాంతం అలరరిస్తూనే ఉంటారు. 

విశ్లేషణ:
ఫస్టాఫ్ అంతా సరదాగా  నవ్వుతూ నడిపించేసి  … సెకండాఫ్ అంతా ఎమోషన్ బేస్డ్ ఫ్యామ్లీ డ్రామా  నడిపారు. అయితే సెకండాఫ్ లో కూడా సుబ్బరాజు , వెన్నెల కిషోర్ లను ప్రవేశపెట్టి ఆడియన్స్ బోర్ ఫీలవకుండా ఎంటర్ టైన్మెంట్  నడిపించారు. ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటూ వెళ్లారు. ఒక కమర్షియల్ డైరక్టర్ హిట్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టమూ పడ్డారు డైరక్టర్ అనిల్ రావిపూడి.ఆయన ప్రయత్నానికి అద్భుతమైన సహకారాన్ని అందించారు నిర్మాతలు దిల్ రాజు అనిల్ సుంకర. 

ఇక ప్రధానంగా  చెప్పుకోవాల్సిన  టీమ్ మరోటి ఉంది. అదే హీరోయిన్ రష్మిక అండ్  ఫ్యామ్లీ మెంబర్స్ . ప్రధాన కథతో సంబంధం లేకుండా ఓ సెపరేట్ ట్రాక్ గానే నడిపేశారు  అనిల్ రావిపూడి . రష్మిక గ్లామరస్ పెర్ఫామెన్స్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అలానే పాటల్లో కూడా చాలా ఎనర్జీతో చేసుకెళ్లిపోయింది. సుబ్బరాజు  వెన్నెల కిషోర్ లతో కల్సి సెకండాఫ్  లో వచ్చిన సీన్స్ లో కూడా రష్మిక చాలా బాగా నటించింది. తెలుగు కమర్షియల్ సినిమాకు  మంచి హీరోయిన్ దొరికినట్టే. హీరోయిన్ పేరెంట్స్ గా రావు రమేష్, సంగీత ఇద్దరూ అదరగొట్టేశారు.

ముఖ్యంగా సంగీత . చాలా గ్యాప్ తర్వాత తనకూ రీ ఎంట్రీ మూవీనే ఇది. మంచి మార్కులే  పడ్డాయి. అలా సరిలేరు నీకెవ్వరు తో తెలుగు సినిమాకు మరో గ్లామరస్ మదర్ దొరికినట్టు అయ్యింది. రాజేంద్రప్రసాద్ ది రొటీన్ కారక్టరే గానీ అందులో కూడా ప్రీ క్లైమక్స్ లో చక్కటి పెర్ఫామెన్స్ చేయించుకున్నాడు  డైరక్టర్.కర్నూలు రైల్వే స్టేషన్ లో మహేష్ బాబు,  ప్రకాశ్ రాజ్ మధ్య నడిచే సీన్ మాత్రం తెలుగు కమర్షియల్ సినిమాకు కొంత కాలం హిట్టు వెలుగు చూపించే  డైరక్టర్ దొరికాడనే హోప్ బలంగా ఇస్తుంది. 

టెక్నీషియన్స్ విజషయానికి వస్తే.. డైరక్టర్ అనిల్ రావిపూడి మాస్ పల్స్ మీద తనకున్న కమాండ్ మరోసారి చాటుకున్నారు ఆడియన్స్ కు కన్ఫూజ్ చేయకుండా ఎంటర్ టైన్ చేయగలిగేది తెల్సిన కథతో.. ఆయన  చేసే స్క్రీన్ ప్లే మ్యాజిక్కే అనే ఒక కీ పాయింట్ ను బాగా జీర్ణం చేసుకున్నాడనిపిస్తుంది. అనిల్ మీద మొదటి నుంచీ ఉన్న ఆరోపణ  ఒక్కటే. తన సినిమాల్లో ఫస్టాఫ్ చాలా బిగిగా నడుస్తుంది.  సెకండాఫ్ కాస్త లాగినట్టు ఉంటుందనే  విమర్శ ఉంది. దాన్నించీ బయటకు రావడానికి సరిలేరు నీకెవ్వరు లో అతను శతవిధాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా రాసుకున్నారు.  అనిల్ రావిపూడి. ఎక్కడా ఆడియన్స్ కు డీవియేట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. ఎమోషనల్ డ్రామాను ఎంటర్ టైన్మెంట్ ప్యాకేజ్ తో ప్రజంట్ చేయడం లో దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన విజయం సాధించాడు. 

టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా నడిపించారు సినిమాటోగ్రాఫర్  రత్నవేలు. ఆయన ఫోటోగ్రాఫీ సినిమాకు మంచి బలాన్ని చేకూర్చింది. లోకేషన్స్ ను అందంగాప్రజంట్ చేశాడు రత్నవేలు.. ఇక  సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. దేవిశ్రీ ప్రసాద్ ఫార్ములా ఎలా ఉంటుందో మొదటి నుండి చూస్తూనే ఉన్నాము కదా.. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు దేవి. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా సినిమాను రిచ్ గా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి.

ప్లస్ పాయింట్స్:
మహేష్ బాబు, విజయశాంతి పెర్ఫామెన్స్ 
అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే, డైరక్షన్ 
పవర్ ఫుల్ డైలాగ్స్,యాక్షన్ సీన్స్  
కామెడీ 
ప్రకాశ్ రాజ్  విలనిజం

మైనస్ పాయింట్స్: 
ఇంప్రెసివ్ గా అనిపించని స్టోరీ లైన్ 
మరీ రొటీన్ గా అనిపించిన పాటలు
సెకండ్ హాఫ్ స్టోరీ
రొటీన్ క్లైమాక్స్ 

ఓవరాల్‌గా.. ఇది టోటల్ గా మహేష్ బాబు చుట్టూ అనిల్ రావిపూడి అల్లిన సినిమా. అందుచేత థియేటర్ నుంచీ బయటకు వచ్చే ప్రేక్షకులు  సరిలేరు నీకెవ్వరు అనే కాంప్లిమెంటు  హీరోకి ఇవ్వాలా డైరక్టర్ కి ఇవ్వాలా అని కన్ఫూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం మంచి విజ్యూవల్ ట్రీట్ అని చెప్పాలి. ఇక పెద్ద సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి కాబట్టి.. వాటి రిజల్ట్ ను బట్టి..బక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.