Categories
National

హ్యాట్సాఫ్ : ఆర్మీ అధికారిణిగా అమరజవాన్ భార్య 

డెహ్రాడూన్ : దేశం కోసం ప్రాణాలు అర్పించేంత త్యాగనిరతి అందరికి ఉండదు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతు..దేశ సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా దేశాన్ని కాపాడే జవాన్ల అంకితభావం..త్యాగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. అలాగే వారిని కదన రంగంలోకి పంపి కుటుంబ బాధ్యలను నెరవేర్చే వారి భార్యల తెగువ గురించి కూడా ఏమాత్రం తక్కువ కాదు. విధి నిర్వహణలో భర్త ప్రాణాలు పోగొట్టుకుంటే ఏమాత్రం అదరక..బెదరక మేము కూడా దేశం కోసం మా ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు సిద్దపడుతున్న ఈ వీర నారీమణులకు గురించి చెప్పాలంటే ఏ భాషలోని అక్షరాలు సరిపోవు..అటువంటి స్ఫూర్తినిస్తున్న ఓ ధీర వనిత గురించి తెలుసుకుందాం..
 

జమ్మూకశ్మీర్ లో భద్రతాదళాలకు..ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో భారత సైనికుడు..శిషీర్ మాల్ మరణించారు. శిషీర్ మాల్ గూర్ఖా రైఫిల్స్ దళంలో పనిచేస్తూ జమ్మూకశ్మర్ రాష్ట్రంలోని బారాముల్లా సెక్టార్ లో 2015 సెప్టెంబరులో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మరణించారు. భర్త శిషీర్ మాల్ దేశంకోసం పనిచేస్తుంటే కుటుంబం కోసం శిషీర్ సతీమణి సంగీతామాల్ టీచర్ గా పనిచేస్తుండేవారు. 
 

భర్త మృతి వార్త తెలిసేనాటికి ఆమె గర్భవతి. పిడుగులాంటి వార్త విన్న ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వటంతో సంగీతకు గర్భస్రావం అయింది. అనంతరం ఆ బాధనుంచి అతి కష్టంతో బైటపడి..తాను కూడా దేశం  కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన  ఆర్మీ పరీక్ష రాసిన సంగీత ఆర్మీ లెఫ్టినెంట్ గా ఎంపికయ్యారు. అనంతరం చెన్నైలోని ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లో ఎంతో కఠినమైన ట్రైనింగ్ తీసుకుని ఆర్మీ అధికారిణిగా..పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్నారు సంగీతామాల్. దేశం కోసం తన భర్త ప్రాణాలను అర్పించారనీ..ఆయన ఆశయ సాధన కోసం తాను కూడా ఆర్మీలో చేరానని అంటున్నారు  ధీర వనిత సంగీతామాల్. భర్త మరణించినా దేశం కోసం..ఆయన ఆశయ సాధన కోసం శ్రమించి ఆర్మీ అధికారిణి అయిన సంగీతకు భారతదేశం యావత్తు  హాట్సాఫ్ చెప్పాల్సిందే.