Categories
National Viral

జర్నలిస్ట్ గోస్వామిపై కమెడియన్ ట్రోలింగ్ : కునాల్‌పై ఇండిగో  6 నెలలు నిషేధం!

ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌, టెలివిజన్ న్యూస్ యాంకర్ అర్ణబ్‌ గోస్వామికి విమానంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. తనదైన శైలిలో ప్రశ్నలతో విరుచుకపడే గోస్వామిపై స్టాండప్‌ కమెడియన్‌, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కునాల్‌ కమ్రా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. గోస్వామిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఇండిగో విమానంలో అర్ణబ్‌ వద్దకు వెళ్లిన కమెడియన్ కునాల్‌ ‘నువ్వు పిరికివాడివా? జర్నలిస్టువా? అంటూ వరుస ప్రశ్నలతో రెచ్చగొట్టారు. అంతేకాదు..ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కమ్రా పోస్టు చేశాడు.

ఈ వీడియోలో తన ల్యాప్ టాప్ చూస్తు కూర్చొని ఉన్న గోస్వామి.. కమ్రా అడిగిన ప్రశ్నలు, ఆయన కామెంట్లపై స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.‘ఈ రోజు.. నేను లక్నోకు వెళ్లే విమానంలో అర్నాబ్ గోస్వామిని కలుసుకున్నాను. అతన్ని మాట్లాడమని మర్యాదగా అడిగాను. అతడి జర్నలిజంపై నేను ఏమనుకుంటున్నానో దానిపై స్పీచ్ ఇచ్చాను. నేను అడిగిన ఏ ప్రశ్నలకు అతడు సమాధానం ఇవ్వలేదు. నన్ను మానసికంగా అసహనానికి గురిచేశాడు’ తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు.

‘రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులు వారి ప్రైవేట్, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఏమి చేస్తారో నేను అదే చేశాను. ఈ విషయంలో నేను బాధపడటం లేదు. దీనికి నేను క్షమాపణ చెప్పను. నేను ఏదైనా తప్పు, నేరం చేశానని అనుకోను. విమానంలో ఒకరు తప్ప ప్రతి ప్రయాణీకుడికి నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని కమ్రా అన్నారు. మీ టీవీ షోలో ఎవరి గురించి అయితే చర్చించారో ఆ రోహిత్‌ వేముల కోసం అడుగుతున్నా అంటూ గోస్వామిని కమ్రా విసిగించారు. 2015లో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.

ఈ సంఘటనపై ట్విట్టర్‌ యూజర్లు మాత్రం భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు గోస్వామికి వేధింపులకు గురిచేసిన సంఘటనగా అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అయితే కమెడియన్ కమ్రాను విమానంలో నో ఫ్లై జాబితాలో ఉంచాలని డిమాండ్ చేశారు. దీనిపై విమానయాన సంస్థ ఇండిగోను కూడా వివరణ కోరుతున్నారు.

నిజం ఏమిటంటే.. ఎవరైనా తన సొంత అభిప్రాయాలను ఎదుటివారిపై రుద్దాలని ప్రయత్నించినప్పుడు.. అదే తరహాలో సమాధానం వారినుంచి వచ్చినప్పుడు పర్యావసనం ఇలానే ఉంటుంది. బెదిరింపు ధోరణిలో హైపిచ్‌లో అతను తన అమాయక బాధితులను వేధించడానికి అతను క్రమం తప్పకుండా ఉపయోగించే పదాలు ఇవి అని రాజకీయవేత్త పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ ట్వీట్ చేశారు.

కునాల్ పై 6 నెలల నిషేధం :
‘కునాల్ కమ్రా ఇలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. అర్నాబ్ గోస్వామి ఒక ప్రముఖ జర్నలిస్ట్, న్యూస్ మోడరేటర్ కూడా. విమానంలో ఉన్నప్పుడు అతన్ని అగౌరవపరచడం, మాటలతో దాడి చేయడం నైతికంగా తప్పు’ అని మరొక యూజర్ అభిప్రాయపడ్డారు. గోస్వామిపై కూనల్ కమ్రా మాటల దాడి చేసిన మరుసటి రోజునే ఇండిగో నుంచి కమ్రాపై సస్పెన్షన్ ప్రకటన వచ్చింది. విమానంలో అతని ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు.

కునాల్‌ తీరును అమర్యాదకరంగా భావించిన ఇండిగో ఆయన తమ విమానాల్లో 6 నెలలు ప్రయాణించకుండా నిషేధం విధించింది. దీనిపై స్పందించిన కునాల్ కమ్రా.. ఎయిర్ ఇండియా సేల్స్ ను ప్రకటనను ప్రస్తావిస్తూ.. ధన్యవాదాలు.. ఆరు నెలలు సస్పెన్షన్ నిజాయితీగా మీలాంటిది. ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాను ఎప్పటికి సస్పెండ్ చేయవచ్చు’ అని కౌంటర్ ఇచ్చారు. దీనిపై స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి.. కమ్రా తీరును అభ్యంతరకరమైనదిగా అభిప్రాయపడ్డారు.