Categories
Bakthi

మతసామరస్యానికి ప్రతీక : ఒకే వేదికపై పీర్లు, వినాయకుడు

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం అర్పపల్లి మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకవైపు గణేష్ ఉత్సవాలు, మరోవైపు మొహర్రం వేడుకలను నిర్వహిస్తున్నారు.

దేశంలో కుల మతాల కొట్లాటలు ఎక్కువయ్యాయి. కులాలు, మతాల పేరుతో మనుషులు విడిపోయి ఉన్నారు. వేర్వేరుగా పండుగలు జరుపుకుంటున్నారు. కానీ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం అర్పపల్లి మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈసారి వినాయక ఉత్సవాలు, పీర్ల పండుగ ఒకేసారి వచ్చాయి. హిందూ, ముస్లింల సఖ్యత.. ఐక్యమత్యం చాటేలా ఒకవైపు గణేష్ ఉత్సవాలు, మరోవైపు మొహర్రం వేడుకలను నిర్వహిస్తున్నారు. పీర్లను, వినాయకుడిని ఒకే వేదికపై ఉంచి, మధ్యలో తెరను ఏర్పాటు చేశారు. 

అందరూ కలిసి ఉత్సాహంగా రెండు పండుగలను నిర్వహించుకుంటున్నారు. కలిసిమెలిసి ఐక్యంగా పండుగను నిర్వహించేందుకే ఇలా ఏర్పాటు చేశామని గ్రామస్తులు బెబుతున్నారు. ఒకే వేదికపై రెండు మతాలకు చెందిన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుల మతాల కొట్లాటలు లేకుండా ఆనందంగా ఉండాలని అంటున్నారు. అర్పపల్లి గ్రామస్తులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

Also Read : వినాయకుడికి రూ.266 కోట్లతో ఇన్సూరెన్స్‌