Categories
Hyderabad

కౌంట్ డౌన్ : తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికల ముగింపు దశ దగ్గరపడుతోంది. ఓట్ల లెక్కింపు తేదీ కూడా సమీపిస్తోంది. దీంతో.. ఈనెల 23న జరిగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఎన్నికల అధికారులు.  ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఎన్నికల మాజీ ప్రధాన అధికారి భన్వర్‌ లాల్ పర్యవేక్షకుడిగా హజరయ్యారు.

ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపునకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఈవీఎంలతోపాటే ర్యాండమ్‌గా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులను సైతం లెక్కిస్తామన్నారు. మల్కాజ్ గిరి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మినహా మిగిలిన స్థానాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తామని  అన్నారు. మల్కాజిగిరిలో 24, నిజామాబాద్‌లో 18 టేబుళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు రజత్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో పంచాయతీ రాజ్ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని చెప్పారు. అటు.. ఏపీలో ఈనెల 17న శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులను ర్యాండమైజేషన్ పద్ధతిలో జిల్లా కలెక్టర్లు ఎంపిక చేస్తారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు.

రెండు, మూడు దశల్లో అబ్జర్వర్ సమక్షంలో కౌంటింగ్ హాళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఫోన్ వినియోగంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు ద్వివేది. ఈవీఎంల ఓపెనింగ్‌కు అవసరమైన ఓటీపీ తెలుసుకునేందుకు ఆర్వోలకు సెల్‌ఫోన్ అనుమతులిస్తామని.. ఓటీపీ ప్రక్రియ పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు అనుమతించబోమని చెప్పారు.