Categories
National

కూతురికి ప్రేమతో : హెలీకాప్టర్ లో అప్పగింతలు

రాజస్ధాన్ లోని ఝుంఝు ప్రాంతంలో ఓ తండ్రి తన కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడానికి ఇచ్చిన వీడ్కోలు చూస్తే షాక్ అవుతారు. తను చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురికి పెళ్లి చేసి.. అత్తారింటికి పంపే కార్యక్రమాన్ని కొత్తగా చేయాలని, తన కూతురికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నాడు తండ్రి. అయితే అనుకున్న విధంగానే.. చాలా కొత్తగా, తన స్థాయికి మించి చేశాడు. ఆ జంటను హెలిక్టాపర్ లో పంపిచాడు. ఈ ఘటన రాజస్ధాన్ లోని అజీత్పుర్ లో చోటు చేసుకుంది.

అజీత్పుర్ గ్రామంలో మహేంద్ర సింగ్‌ శ్లోకా అనే వ్యక్తి తన కూతురు రీనాకు ఆమె ప్రేమించిన సందీప్‌ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. రీనా BA మెుదటి సంవత్సరం చదువుతోంది. తన భర్త సందీప్ నాసిక్ రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. పెళ్ళి తర్వాత తన కూతురిని అందరిలా కాకుండా కొత్తగా హెలిక్టాపర్ పంపాలని ఆయన కోరిక. అయితే అనుకున్న విధంగానే.. హెలిక్టాపర్ బుక్ చేసి పంపారు.

వధువు తండ్రి మాట్లాడుతూ..నా కూతురికి గుర్తు ఉండిపోయే విధంగా ఉండాలని ఒక సంవత్సరం నుంచే ప్లాన్ చేసుకున్నాను. ఈ విషయాన్ని పెళ్లికి రెండు నెలల ముందు నా కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నాను అని తెలిపారు. ఈ విధంగా ఆ నూతన జంట అజీత్పుర్ నుంచి హెలిక్టాపర్ లో బయలుదేరి సుల్తాన్ పూర్ లోని తన భర్త ఇంటికి వెళ్లారు.