Categories
National Slider

ప్లాస్మా దానం చేస్తానని..అసెంబ్లీ స్పీకర్ నే బురిడీ కొట్టించిన కేటుగాడు: కరోనా దందాలు

కరోనాతో దేశాలకు దేశాలే యుద్ధాలు చేస్తుంటే కొంతమంది కేటుగాళ్లు కరోనా పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి మోసం ఢిల్లీలోబైట పడింది. ఎలాగైనా సరే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకునే మోసం అయితే ఇట్టే సంపాదించేయొచ్చు అనుకున్నాడేమో ఓ మోసగాడు..ప్లాస్మా దాత అవతారం ఎత్తాడు.

కరోనా భయంతో ప్రజలు భయాన్నే పెట్టుబడిగా చేసుకుని రంగంలోకి దిగాడు. ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతూ తన మోసాల్ని యదేచ్చగా కొనసాగించాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ మోసగాడి వలలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌ కూడా పడ్డారు.  

దీంతో స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌ పోలీసులకు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్లాస్మా కేటుగాడిని పట్టుకున్నారు. కరోనా వేళ ప్లాస్మా దాత ముసుగులో అతను వేసిన స్కెచ్ విని ఆశ్చర్యపోయారు. 

వివరాల్లోకి వెళితే..అబ్దుల్ కరీం రానా అనే 22 ఏళ్ల యువకుడు ప్లాస్మా దాతగా సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ప్లాస్మా కోసం పోస్టులు పెట్టే వారిని టార్గెట్ గా చేసుకుని తన దందాను కొనసాగించాడు. ప్లాస్మా దానం చేస్తానని..మీకు అది అందజేయాలంటే తన ప్రయాణానికి కావాల్సిన డబ్బులు తన బ్యాంక్ ఎకౌంట్ లో వేయాలని చెప్పేవాడు. 

అతని మాటలు నమ్మి డబ్బులు వేసిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసి..మరో వ్యక్తి కోసం గాలం వేస్తున్నాడు. ఈ మాయగాడి వలలో అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ కూడా చిక్కటంతో సదరు కేటుగాడి బండారం బైటపడింది. 

స్పీకర్ మేనల్లుడు కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన తన బావ కోసం ప్లాస్మా దాత కోసం వెతుకుతున్నాడు. అనంతరం సోషల్ మీడియాలో సహాయం కోసం ఒక అభ్యర్థనను పోస్ట్ చేశారు. అనంతరం సదరు మోసగాడి నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎవరు? అని ప్రశ్నించగా..నేను ఓ గవర్నమెంట్ డాక్టర్ ని కరోనా రోగుల కోసం ఇటువంటి సహాయాలు చేస్తుంటాను అని..చాలామందికి ఇలాగే సహాయం చేశాను..వాళ్లంతా చక్కగా ఆరోగ్యంగా కోలుకున్నారని  ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు.

అది నమ్మిన స్పీకర్ ను యధావిధిగా ప్రయాణం కోసం డబ్బులు అడగటం..ప్లాస్మా కోసం స్పీకర్ డబ్బులు ఇవ్వటం జరిగిపోయాయి  ఆ తర్వాత సదరు ప్లాస్మా దాత ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చి..పోలీసులకు తెలియజేయటంతో ప్లాస్మా మోసగాడు పోలీసు సంకెళ్లకు చిక్కాడు. దీనిపై అతన్ని విచారించగా..ప్లాస్మా చికిత్స మొదలైనప్పటి నుంచి ఈ దందా చేస్తున్నట్టుగా అంగీకరించాడు.

దీంతో సదరు మోసగాడిపై సెక్షన్ 420 (చీటింగ్)కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్) మోనికా భరద్వాజ్ తెలిపారు. 

Read: వంట మాస్టర్ కు కరోనా…. పెళ్లి వారు క్వారంటైన్ కి