Categories
Andhrapradesh Latest Political

నన్నూ అరెస్ట్ చేయండి, సీఎం జగన్ ను కోరిన నారా లోకేష్

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. టీడీపీ సోషల్

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్లు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని లోకేష్ ఆరోపించారు. మొన్న గుంటూరుకు చెందిన రంగనాయకమ్మపై సీఐడీ కేసు.. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన సత్యం రెడ్డి అనే కార్యకర్తను అరెస్ట్ చేయడంపై ట్విట్టర్ వేదికగా లోకేష్ తీవ్రంగా స్పందించారు. రంగనాయకమ్మ పోస్టునే నేను కూడా పెడుతున్నా.. నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి అని లోకేష్ ట్వీట్ చేశారు.

జగన్ వెన్నులో వణుకు:
సోషల్ మీడియా అనగానే వైఎస్ జగన్ గారి వెన్నులో వణుకు మొదలవుతుందన్నారు లోకేష్. అసమర్థ పాలన సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుందనే భయం జగన్ ను వెంటాడుతోందన్నారు. రంగనాయకమ్మ పెట్టిన పోస్ట్‌ను లోకేష్ కూడా ట్వీట్ చేశారు. #ArrestMeeToo, #WeStandWithRanganayakamma అనే హ్యాష్ ట్యాగ్ తో లోకేష్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

అభిప్రాయాలు చెబితే అరెస్ట్ చేస్తారా?
నెల్లూరు జిల్లాలో సత్యం రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయడంపైనా లోకేష్ ఘాటుగా స్పందించారు. సత్యం రెడ్డి తన అభిప్రాయాలు చెప్పినందుకు మూడు రోజుల్లో రెండుసార్లు అరెస్ట్ చేశారని.. కరోనా వైరస్ వంటి సమయంలో సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం తప్ప ఎలాంటి పనులు లేవా అని ప్రశ్నించారు. ఎవరైనా తమ భావాలను వ్యక్తీకరించే హక్కును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. సత్యంరెడ్డికి తన మద్దతు ఉందని లోకేష్ స్పష్టం చేశారు.

Read:  కరోనా లేకపోతే ఆందోళన చేసేవాడిని, డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పుపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఎవరీ రంగనాయకమ్మ? ఆ పోస్టులో ఏముంది? సీఐడీ ఎందుకు కేసు పెట్టింది?
నారా లోకేష్ ప్రస్తావించిన రంగనాయకమ్మ ఎవరు? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఎందుకు మారారు? అనే వివరాల్లోకి వెళితే.. రంగనాయకమ్మ.. గత మూడు, నాలుగు రోజులుగా వినిపిస్తున్న పేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో గుంటూరుకు చెందిన ఆమెపై కేసు నమోదు చేసిన సీఐడీ.. నోటీసులు జారీ చేసింది.. ఆమె విచారణకు కూడా హాజరయ్యారు. సీఐడీ కేసుతో రంగనాయకమ్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె వివరాల కోసం నెటిజన్లు కొందరు ఆరా తీస్తున్నారు. అసలు ఇంతకీ రంగనాయకమ్మ ఎవరు.. ఆమె ఫేస్‌బుక్ పోస్టులో ఏముంది.. సీఐడీ అభియోగాలు ఏంటి.. కేసు ఎందుకు పెట్టింది.. అధికారుల వాదనేంటి.. 

1

ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే రంగనాయకమ్మ:
గుంటూరు లక్ష్మీపురానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ కుటుంబం వ్యాపారాలు చేస్తోంది. రంగనాయకమ్మ వయసు 60 సంవత్సరాలు. ప్రముఖ హోటల్‌ శంకర్ విలాస్‌కు ఆమె డైరక్టర్‌గా ఉన్నారు. అంతేకాదు ఆమె సామాజికంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.. ఫేస్‌బుక్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తాజా పరిణామాలపై ఆమె ఎప్పటికప్పడు స్పందిస్తుంటారు.. తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటారు. అంతేకాదు ఆమె టీడీపీకి సానుభూతిపరురాలు. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో చంద్రబాబు ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రంగనాయకమ్మ పోస్టు మంటలు రేపింది:
మే 12న రంగనాయకమ్మ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. మొత్తం 20 పాయింట్లతో కొన్ని ప్రశ్నలను అనుమానాలుగా ప్రస్తావించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లోపల ఏదో జరిగిపోయిందని.. ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారని.. డీజీపీ పర్యటనకు సంబంధించి అంశాలను పోస్టులో పొందుపరిచారు. చివరలో మాత్రం రఘునాథ్ మల్లాది వ్యక్తి నుంచి సేకరించినట్లు ప్రస్తావించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఐడీకి ఫిర్యాదు వెళ్లడంతో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. ఆమె మొబైల్‌ను సీజ్ చేశారు.

cid

రంగనాయకమ్మపై కేసు పెట్టిన సీఐడీ:
ఈ పోస్టుపై సీఐడీ ఆమెను ఏ1గా.. మల్లాది రఘునాథ్‌ను ఏ2 చేర్చింది. అతడ్ని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన చాలా సున్నితమైనది.. ప్రభుత్వం మీద రంగనాయకమ్మ దుష్ప్రచారం చేశారన్నది సీబీఐ అభియోగం. ప్రజల్లో భయాందోళనలు కలిగించే రీతిలో ఈ పోస్ట్ ఉందని చెబుతోంది. తప్పుడు ప్రచారంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజల్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారంటోంది. నిందితులపై సెక్షన్‌ 505(2), సెక్షన్‌ 153(ఏ),సెక్షన్‌ 188, సెక్షన్‌ 120(బి), రెడ్‌ విత్‌ ఐపీసీ సెక్షన్‌ 34 కింది కేసులు నమోదయ్యాయి. అలాగే ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ 67 కింద కేసు నమోదయ్యింది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే మొదటిసారి నేరానికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా ఉంటుంది. మళ్లీ ఇలాగే చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష 5ఏళ్లు, రూ.10లక్షలు జరిమానా విధించే అవకాశం ఉంది.

జస్ట్, కాపీ పేస్ట్ చేశాను, అంతే:
ఈ వ్యవహారంపై రంగనాయకమ్మ స్పందించారు. సీఐడీ ఆరోపణలను ఆమె ఖండించారు. మల్లాది రఘనాథ్ ద్వారా తీసుకున్న సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో కాపీ పేస్ట్ చేశానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కనీసం తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకపోతే మన గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు వచ్చిన సమాచారాన్నే షేర్ చేశాను అంతే అన్నారు. అయితే భుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టానని నోటీసులు ఇచ్చారని.. అది చట్ట వ్యతిరేకం అవుతుందని తనకు తెలియదన్నారు. చదువుకోవడానికి బాగుందని కాపీ పేస్ట్ చేశానని వివరణ ఇచ్చారు. అంతమంది చనిపోయారనే బాధ తనలోనూ ఉందన్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తే తనకు ఒరిగేదేమీ లేదన్నారు.