Categories
Crime Hyderabad

సరోగసీ అన్నాడు..అమ్మాయిని చూశాక సరసానికి రమ్మన్నాడు..

అపుత్రస్య గతిర్నాస్తి …..అనే సూక్తిలో చెప్పినట్లు….  వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. అలా అనుకున్నాడో ఏమో హైదరాబాద్ కు చెందిన 64 ముసలోడు 23 ఏళ్ల యువతితో సరోగసి ద్వారా మగ పిల్లాడ్ని కనాలనుకున్నాడు. వ్యవహారం బెడిసి కొట్టి ఊచలు లెక్కపెడుతున్నాడు. 
 

హైదరాబాద్ పంజాగుట్ట, ఆనంద్ నగర్ కాలనీకి చెందిన స్వరూప్ రాజ్ కు 64 ఏళ్లు. ఇప్పటికే ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ వయస్సులోనైనా వంశానికి ఒక కుమారుడిని కనాలని ఆశపడ్డాడు. ఈవిషయాన్ని తన మిత్రుడు నూర్ కు చెప్పాడు. నూర్  సహయంతో నగరానికి చెందిన 23 ఏళ్ళ యువతితో సరోగసీ ద్వారా కొడుకును కనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  

ఇందుకోసం ఆ యువతికి ఒకేసారి 5 లక్షల రూపాయల నగదు మరియు డెలివరీ అయ్యేంతవరకు నెలకు 10 వేల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ క్రమంలో ఒక రోజు  ఆ యువతిని స్వరూప్ రాజ్ కలుసుకున్నాడు. యువతిని చూడగానే ముసలోడిలోని మానవ మృగం నిద్రలేచింది. యువతితో చేసుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టాడు. సహజ సిధ్దంగా పిల్లలను కనాలంటూ  23 ఏళ్ల యువతిని వేధించటం మొదలెట్టాడు.  

ఒప్పందం ప్రకారం కాకుండా తనతోనే పిల్లలనుకనాలనే వక్రబుధ్ధి బయటపెట్టాడు. ముసలోడి వేధింపులతో ఖంగు తిన్న యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి  దిగిన పోలీసులు స్వరూప్ రాజ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు ఏసీపీ తిరుపతన్న వివరించారు.