Categories
Movies

రావణుడు బ్రతికే ఉన్నాడు.. పుకార్లు ఆపండి..

‘రామాయణ్’ సీరియల్లో రావణుడి పాత్రధారి అర్వింద్ త్రివేది చనిపోయారనే వార్తలపై ఆయన మేనల్లుడు స్పందించారు..

బాలీవుడ్‌ పరిశ్రమలో గతకొద్ది రోజుల్లో వరుసగా నాలుగు మరణాలు సంభవించడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ వంటి లెజెండరీ యాక్టర్స్ 24 గంటల వ్యవధిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇర్ఫాన్ చనిపోయిన రోజు (ఏప్రిల్ 29, బుధవారం రాత్రి) పాపులర్ యంగ్ సింగర్‌, నటుడు అర్జున్‌ కనుంగో తండ్రి కూడా మరణించిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది.

శుక్రవారం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా CEO కుల్మీత్ మక్కర్ (60)గుండెపోటుతో కన్నుమూశారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నసీరుద్దీన్‌ షా అనారోగ్యంతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు అనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్వయంగా ఆయనే స్పందించాల్సి వచ్చింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించిన అర్వింద్ త్రివేది లంకేశ్(82) మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో స్ర్పెడ్ అవడంతో ఆయన మేనల్లుడు స్పందించారు.

‘‘మా అంకుల్‌ అరవింద్‌ త్రివేది లంకేశ్‌ క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆయనపై అసత్య ప్రచారం ఆపండి. ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ  తెలియజేయాలనే ట్వీట్ చేస్తున్నాను’’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘రామాయణ్‌’ సీరియల్‌ను దూరదర్శన్‌ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. రావణ పాత్రధారి అరవింద్‌ త్రివేది..  సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో ఇటీవల వైరల్‌ అయింది. ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక రేటింగుతో దూసుకెళ్తోంది ‘రామాయణ్’.