Categories
71723

దెయ్యాల గ్రామాల్లో క్వారంటైన్ కేంద్రాలు..ఉత్తరాఖండ్ సర్కార్ వినూత్న యోచన

మనుషులు లేని ఇంటిని ఇదేంటిరా దెయ్యాల కొంపలా ఉంది అంటారు. అదే ఊర్లకు ఉర్లే మనుషి సంచారం లేకుండా పోతే వాటినే దెయ్యాల గ్రామాలు అంటారు. ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలో అటువంటివి కొన్ని (దెయ్యాల గ్రామాలు) గ్రామాలున్నాయి. మనుషులు లేక వెలవెలబోతున్న ఆ దెయ్యాల గ్రామాలే ఉత్తరాఖండ్ నుంచి వలసలు వెళ్లి కరోనావైరస్ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో లాక్ డౌన్ వల్ల తిరిగి స్వంత ఊర్లకు చేరుకుంటున్న వలస కూలీలకు క్వారంటైన్లుగా మారాయి. 

మూడో విడత లాక్ డౌన్  సడలింపుల వల్ల వలస కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లే వీలు చిక్కింది. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తుండడంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలుండటంతో వారికి  క్వారంటైన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వాలకు ఓ సమస్యగా మారింది. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆ ‘దెయ్యాల గ్రామాలే’ సరైన స్థలాలని కనుగొన్నారు అధికారులు.ఇంకేముంది ఆ దెయ్యాల గ్రామాలే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేశారు.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ చేసిన గ్రామాలను వలస కార్మికులకు క్వారంటైన్లుగా ఉపయోగించుకోవాలని భావించింది ప్రభుత్వం. ఉత్తరాఖండ్ లో సరైన వసతులు లేని గ్రామాలను ప్రజలు ఖాళీ చేయగా, ఇప్పుడక్కడెవరూ నివాసం ఉండడంలేదు. దాంతో పాడుబడిన ఆ గ్రామాలను దెయ్యాల గ్రామాలుగా పిలుస్తుంటారు. ఇప్పుడా దెయ్యాల గ్రామాలే ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆశాదీపాల్లా కనిపిస్తున్నాయి.

సాధారణ గ్రామాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేస్తే వైరస్ వ్యాపించే ముప్పు ఉన్న దృష్ట్యా, ఈ దెయ్యాల గ్రామాల్లో అయితే ఎవరికీ ఎటువంటి సమస్యా ఉండదని ఉత్తరాఖండ్ అధికారులు అంటున్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో ఇటువంటి దెయ్యాల గ్రామాలు 186 వరకు ఉన్నాయట. ఇప్పుడు వాటిలో చాలా గ్రామాల్లో సదుపాయాలు కల్పించారు. ఇళ్లను శుభ్రం చేయించి క్వారంటైన్ కోసం వచ్చే వలస కార్మికులకు అనువుగా తీర్చిదిద్దారు.

Read Here>>ఫ్యామిలీ అంతా క్వారంటైన్ లో ఉండగా..ఇల్లు దోచేసిన దొంగలు