Categories
National

ప్రమాదాలకు బలైపోతున్న వలస బతుకులు:మధ్యప్రదేశ్ లో మరో ఆరుగురు మృతి

లాక్ డౌన్ సంకెళ్లను తెంచుకుని ‘మా ఊరెలిపోతాను మామా’ అంటూ బయలుదేరిన వలస కూలీల బతుకులు దారిలోనే తెల్లారిపోతున్నాయి. కొంతమంది కాలినడకన తమ సొంత ఊర్లకు వెళ్లిపోతుంటే..ఇంకొందరు రోడ్డు మార్గంలో పలు వాహనాల్లో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో వలస కార్మికులతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని  చికిత్స నిమిత్తం సాగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి యూపీకి వెళుతుండగా మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ – ఛత్తార్‌పూర్‌ సరిహద్దులో శనివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. 

ప్రమాదం జరిగిన తీరుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవటంతో ఘటనాస్థలిలో హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.మన ఊరు వెళ్లిపోదామం బంగారం అని చెప్పిన తల్లి ప్రమాదంలో చనిపోయిందనీ..తనకు ఎప్పుడు కనిపించదని తెలియనీ ఓ పసిబిడ్డ తల్లి మృతదేహం వద్ద అమ్మా..అంటూ  ఏడ్చిన ఘటన చూసినవారందరినీ కంట తడి పెట్టించింది. 

ఈ ప్రమాదస్థలిలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం కోరుకున్నారు.

కాగా..యూపీలో కూడా ఔరయ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 31 మంది వలస కార్మికులు రోడ్డుప్రమాదాలకు బలయ్యారు. లాక్ డౌన్ తో తమ సొంత ఊర్లకు వెళ్లిపోయే వలస కూలీలను మృత్యువు ప్రమాదం రూపంలో కాటు వేసింది. కరోనా కాటునుంచి తప్పించుకున్న ఈ వలసల బతుకులు రోడ్డు ప్రమాదాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోవటం తీవ్రంగా కలచివేస్తోంది.

Read Here>> మరో ఘోరం : 23 మంది వలస కూలీలు మృతి