Categories
Hyderabad Political

కోమటి రెడ్డి, సంపత్ కుమార్ కేసు : మార్చి 8  కి వాయిదా 

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సంపత్ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు వ్యవహారం పై శుక్రవారం  హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా  కోర్టును అవమానించేలా వ్యవహరించారని అడిషనల్ ఏజీ రామచంద్రరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు నర్సింహాచార్యులు,  నిరంజన్ రావు లు హైకోర్టుకు హాజరయ్యారు. వారిచ్చిన వివరణకు సంతృప్తి చెందని హైకోర్టు ఇరువురిని కస్టడీలోకి తీసుకోవాలని, 10వేల రూపాయల పూచీకత్తు సమర్పించిన తర్వాత వారిని విడిచిపెట్టాలని జ్యూడిషియల్ రిజిస్ట్రార్ ను ఆదేశించింది. కాగా వారిరువురూ రూ.10వేల పూచీకత్తు సమర్పించిన తర్వాత విడిచిపెట్టారు. 

అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనచారికి మరోసారి హైకోర్టు  ఈరోజు నోటీసులు జారీ చేసింది. డీజీపీ, గద్వాల, నల్గొండ ఎస్పీలకు  కూడా మరోసారి హైకోర్టు నోటీసులు  ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు మార్చి 8కి వాయిదా వేసింది.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ప్రతి వాదిగా చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ  చేసింది.