Categories
National

కాళ్లూ చేతులూ లేకున్నా కంప్యూటర్ జాబ్ : కలెక్టర్ ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్‌కు చెందిన ఆశీష్‌ కు కాళ్లూ చేతులు లేవు. అయినా..కష్టాల్ని జయించి నిలిచాడు..గెలిచాడు. కుటుంబానికి అండగా నిలిచాడు. అంతులేని ఆత్మవిశ్వాసంతో చదువుల్లో రాణించాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 

ఆశీష్‌కు పుట్టుకతోనే కాళ్లూచేతులూ లేవు. కానీ చక్కగా చదువుకున్నాడు. శంకర్‌గఢ్ పంచాయతీ ఆఫీసులో అశీష్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.10 వేలు సంపాదిస్తు కుటుంబానికి ఆధారమయ్యాడు. కాళ్లూ చేతులు సక్రమంగా ఉన్నవారు చేసే పనుల్ని కూడా ఆశీష్ చక్కగా చేసేస్తాడు.  కంప్యూటర్ని అవలీలగా ఆపరేట్ చేస్తాడు. మొబైల్ ను వాడేస్తాడు. అంతేకాదు స్కూటీని కూడా చక్కగా నడిపేస్తాడు. కాళ్లూ చేతులు సక్రమంగా ఉన్నవారు కూడా చేయలేని పనులు చేస్తున్న ఆశీస్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. 

ఆశీష్ గురించి అతని పట్టుదల..పని పట్ల అతని అంకిత భావం గురించి బలరామ్ పూర్ జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝూ మాట్లాడుతూ..ఆశీష్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడనీ…ఎవరిసాయం అవసరం లేకుండానే పనులన్నీ స్వయంగా చేసుకుంటాడు. కుటుంబ భారాన్ని మోస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆశీష్ ను చూసి నేటి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. 

చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు..‘ఆశీష్’ గురించి తెలుసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉండీ..అన్ని సౌకర్యాలు ఉండి కూడా  అర్థం పర్థం లేని కారణాలకే నిరుత్సాహ పడిపోతుంటారు. ఎలా బతకాలిరా దేవుడా అంటూ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వారే అనుభవించేస్తున్నట్లు ఫీలైపోతుంటారు.ఇటువంటివారు ఆశీష్ ను స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.