Categories
Political

అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు జగన్ చెప్పలేదు : కొడాలి నాని

ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో

ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు చెబుతుంటే.. రాజధానిని తరిలించి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నట్లు మేం ఎక్కడా చెప్పలేదని.. అమరావతితో పాటు మరో రెండు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్‌తో రాజధాని కట్టాలంటే రూ. లక్షా 15వేల కోట్లు అవసరం అవుతాయని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యపడదని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పును 90వేల కోట్ల రూపాయల నుంచి 3 లక్షల 50వేల కోట్లకు చంద్రబాబు పెంచారన్నారు.

రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం లేదని.. ప్రస్తుతం పెండింగ్‌ పనులు పూర్తి చేసి పాలనపై దృష్టి పెడితే చాలన్నారు. ఏపీ అంటే.. వ్యాపారవేత్తలు వెయ్యి కిలోమీటర్లు పరిగెత్తే పరిస్థితికి తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మార్చడమేంటని ప్రశ్నించారు. రాజధానిని ఒక్క ఇంచు మార్చిన ఊరుకునేది లేదని సుజనా హెచ్చరించారు

సుజనా చౌదరి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సుజనా మాట ఏమైనా శాసనమా అంటూ విమర్శించారు. ఈ విషయాలు ప్రధాని మోడీ మీ చెవిలో చెప్పారా అంటూ ప్రశ్నించారు. ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ దిశగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. 

ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఏపీకి ఏం చేశారని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఏనాడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా అని అడిగారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టడం ఆయనకు ఇష్టం ఉందో? లేదో? చెప్పాలన్నారు. ఏపీలో రాజధాని మార్పును కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికారపక్ష నేతల హామీలు, ఇటు ప్రతిపక్షనేతల వ్యాఖ్యలతో ప్రజలు అయోమయంలో పడిపోయారు. మొత్తంగా మూడు వారాల్లో రాజధాని అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

* అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు చెప్పలేదు- కొడాలి నాని
* చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ కు రూ.లక్షా 15వేల కోట్లు- కొడాలి నాని
* ఒక్క అంగుళం కూడా కదిలించడానికి వీల్లేదు- సుజనా 
* ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా- సుజనా
* నీ మాట ఏమైనా శాసనమా? వేదమా?- బొత్స
* ప్రధాని మోడీ మీ చెవిలో చెప్పారా- బొత్స
* భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి- అశోకగజపతి రాజు
* కేంద్ర మంత్రిగా ఏపీకి ఏం చేశావ్- బొత్స

Also Read : పవన్ స్టాండ్ ఏంటీ ? : మూడు రాజధానులకు అనుకూలమా ? వ్యతిరేకమా ?

Categories
Andhrapradesh Political

అశోకుడి మౌనం : రాజకీయాల్లో కొనసాగుతారా? కేడర్ డీలా!

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో విజయనగరం ఒకటి. కానీ, మొన్నటి ఎన్నికల్లో జిల్లాను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా ఫలితం లేకపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో గెలిచిన టీడీపీ.. ఆ తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు పెరిగింది. అయితే, జిల్లా టీడీపీలోకి ఎవరు వచ్చినా, వెళ్లినా…. పార్టీకి పెద్ద దిక్కు మాత్రం ఎప్పుడూ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజే.

జిల్లాలో కుదేలైన టీడీపీ : 
పార్టీ ఆవిర్భావం నుంచి బాధ్యతలను తన భుజాలపై వేసుకొని… రాజుల కోటను టీడీపీకి కంచుకోటగా మార్చారాయన. జిల్లా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా… ఎవరికి ఏ పదవిని అప్పగించాలన్నా… అశోక్ గజపతిరాజు ఆమోదం పొందాల్సిందే. జిల్లా పార్టీ వ్యవహారాల్లో వేరే నాయకులెవరూ వేలు పెట్టేందుకు కూడా సాహసించరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అశోక్ గజపతిరాజుపై ఉన్న గౌరవంతో జిల్లా వ్యవహారాల్లో కలుగజేసుకొనే వారు కాదు. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలవ్వడం పార్టీ పెద్ద అశోక్ గజపతిరాజు సైతం ఊహించని దెబ్బ.

టీడీపీ కేడర్ డీలా : 
ఎన్నికల వరకు మంచి ఊపు మీద ఉన్న టీడీపీ కేడర్ ఫలితాలొచ్చాక పూర్తిగా డీలా పడిపోయింది. పార్టీని నడిపించే నాథుడు లేక నాయకులతో పాటు కేడర్ కూడా సైలెంట్ అయిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన అశోక్ గజపతిరాజు… ఆ తర్వాత అనారోగ్యంతో హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో రాజుల వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన అదితి గజపతిరాజు కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత కాలంలో ఆమె కూడా దూరమయ్యారు.

అనారోగ్యంతో జిల్లాను విడిచి వెళ్లిన అశోక్ గజపతిరాజు… శస్త్రచికిత్స తదితర కారణాలతో సుమారు ఆరు నెలల వరకు జిల్లాలో కానరాలేదు. ఈ సమయంలో పార్టీ కేడర్ అంతా కకావికలమైపోయిందట. అప్పుడప్పుడు అధిష్టానం ఇచ్చిన పిలుపుతో తూతూ మంత్రంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహించినా అశోక్ లేని లోటు స్పష్టంగా కనిపించిందంటున్నారు.

ఇతర సీనియర్ నేతలైన సుజయ్ కృష్ణ రంగారావు, శత్రుచర్ల విజయరామరాజు, పతివాడనారాయణ స్వామి నాయుడు వంటి నేతలు జిల్లాలోనే ఉన్నప్పటికీ, వారి ప్రభావం పెద్దగా కానరాలేదంటున్నారు. దీంతో జిల్లాలో పార్టీని నడిపే నాథుడే లేడా అన్న సంకేతాలు పార్టీ కేడర్‌ను ఆందోళనలోకి నెట్టేశాయని అంటున్నారు.

బంగ్లాకే పరిమితమైన అశోక్ :
శస్త్రచికిత్స ముగిశాక కొన్ని రోజులు ఢిల్లీలో గడిపిన అశోక్… సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలనే మళ్లీ జిల్లాలోకి అడుగు పెట్టారు. అశోక్ గజపతిరాజు జిల్లాకు వచ్చేశారు… ఇక పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలు జోరందుకుంటాయని ఊహించారంతా. కానీ, అశోక్ మాత్రం జిల్లాకు వచ్చినప్పటి నుంచి తన బంగ్లాకే పరిమితమవుతున్నారట. పార్టీ కేడర్‌కు ఇంకా అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.

స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో అశోక్ రీ-ఎంట్రీతో లెక్కలు మారతాయనుకుంటే ఆ పరిస్థితిలేవీ కనిపించడం లేదని జనాలు అంటున్నారు. వయోభారం, అనారోగ్య కారణాలతో రానురాను అశోక్ గజపతిరాజు రాజకీయాలకు దూరమవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి ఎవరు నడిపిస్తారనే ప్రశ్న పార్టీని వేధిస్తోందంట.

Categories
Uncategorized

గెలుపెవరిది : విజయనగరం, బొబ్బిలి రాజ కుటుంబీకులకు ఫలితాల టెన్షన్

ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమాలో వారు ఉంటున్నా.. అభ్యర్థులకు మాత్రం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఏమిటో ఎవరికీ అంతుపట్టకపోవడంతో .. అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి మరింత వేడి పుట్టిస్తోంది. జిల్లాలో రెండు ప్రధాన పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. పైకి ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా… లోపల మాత్రం టెన్షన్‌తో చచ్చిపోతున్నారు.

విజయనగరం జిల్లాలో రాజ కుటుంబాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్న రాజులంతా.. ఈ ఎన్నికల్లో ఒకే పార్టీ, ఒకే గుర్తుపై బరిలోకి దిగడం.. కొత్త చర్చకు దారితీసింది. విజయనగరం పూసపాటిరాజులు, బొబ్బిలి రంగారావు, కురుపాం కిశోర్ చంద్రదేవ్‌తో పాటు మేరంగి రాజకుటుంబీకులు .. టీడీపీ తరపున బరిలోకి దిగారు. విజయనగరం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పి.అశోక్ గజపతిరాజు పోటీ చేయగా, విజయనగరం అసెంబ్లీ స్థానానికి ఆయన కుమార్తె అదితి గజపతిరాజు బరిలోకి దిగారు. బొబ్బిలి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, కురుపాం టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరి నరసింహప్రియ థాట్రాజ్ పోటీ చేయగా, అరకు ఎంపీ స్థానానికి మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ దేవ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజులంతా ఒకే పార్టీ నుంచి పోటీ చేయడంతో .. ప్రజల దృష్టంతా వీరిపైనే ఉంది. ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయన్నది హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో గెలుపుపై ఎంతో ధీమాగా ఉన్న ఈ రాజకుటుంబాలు.. ఇప్పుడు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నాయట.

విజయనగరం అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అదితి గజపతిరాజుకు.. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గట్టి పోటీ ఇచ్చారు. విజయనగరం అంటే పూసపాటిరాజులకు కంచుకోట. అలాంటిది ఊహించని విధంగా వైసీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడంతో .. ఫలితంపై టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌కు ముందు టీడీపీకే విజయావకాశాలున్నాయన్న ప్రచారం జరగ్గా, పోలింగ్ తర్వాత మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఆ ఉత్సాహం లేదు. ఎంపీగా అశోక్ గజపతిరాజు బరిలోకి దిగడంతో ఈ అసెంబ్లీ స్థానంలో భారీగా క్రాస్‌ ఓటింగ్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, ఎంపీ ఓటు అశోక్ గజపతిరాజుకు, అసెంబ్లీ ఓటు కోలగట్లకు క్రాస్‌ ఓటింగ్ పడిందన్న వాదన జరుగుతోంది. దీంతో టీడీపీ శ్రేణులతో పాటు రాజ కుటుంబంలోనూ కొంత నైరాశ్యం ఆవహించినట్లు తెలుస్తోంది. పోలింగ్ జరిగిన తీరుపై అశోక్ గజపతిరాజు సైతం తీవ్ర అసహనంలో ఉన్నట్లు ఆ పార్టీ కేడర్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ పరిస్థితి రావడానికి ఎప్పుడూ అశోక్ గజపతి వెన్నంటి ఉండే ఇద్దరు ప్రధాన అనుచరులే కారణమని, వారిద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగిందని సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన అశోక్ …వారిని తన బంగ్లాకి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేశారట.

బొబ్బిలి నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ విజయాల్ని మూటగట్టుకుని నాలుగోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగిన సుజయ కృష్ణ రంగారావు సోదరులు కూడా .. తీవ్ర అసహనంలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు వరకు గెలుపు ధీమాలో ఉన్న బొబ్బిలి రాజ కుటుంబం, పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి తలకిందులైందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శంబంగి వెంకటచిన అప్పలనాయుడు .. నిన్న మొన్నటి వరకు అంతగా ప్రాధాన్యత లేని నేతగా చెప్పుకున్నారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో .. చివరకు ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. అటువంటి నేతపై గెలవడం చాలా ఈజీ అనుకున్నారు అందరూ.

కానీ జరిగిన పోలింగ్ సరళిని బట్టి.. బొబ్బిలి రాజుకు గట్టిపోటీయే ఎదురైందన్న ప్రచారం జరిగింది. బొబ్బిలి నియోజకవర్గంపై బొత్స కుటుంబం ఎక్కువగా ఫోకస్‌ పెట్టడం, జగన్‌కు ఉన్న ఇమేజ్ నేపధ్యంలో ఫ్యాన్ గాలి అక్కడ బాగా వీచిందని చెప్పుకుంటున్నారు. దీంతో బొబ్బిలి రాజులకు ఊహించని పరిస్థితి తలెత్తడంతో .. లోలోపలే వారు టెన్షన్ పడుతున్నారట. ఇలాంటి పరిస్ధితుల్లో బొబ్బిలి సోదరుల మధ్య విభేదాలు కూడా తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో డబ్బుల పంపిణీ విషయంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది.

కురుపాంలో విభిన్న పరిస్థితి తలెత్తింది. తొలుత టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్‌ .. కుల వివాదం కారణంగా అభ్యర్థిత్వం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో డమ్మీగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తల్లి నరసింహప్రియ థాట్రాజ్ అభ్యర్థిత్వం ఖరారైంది. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆమె గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ హోరా హోరీ పోరు జరగడంతో విజయంపై ఇరువర్గాలు తీవ్ర టెన్షన్ పడుతున్నాయి. పోలింగ్ రోజున జియ్యమ్మవలస మండలం చినకుదుమ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుపై టీడీపీ కార్యకర్తలు దాడిచేయడం దుమారం రేపింది. ఇది కాస్తా శత్రుచర్ల కుటుంబంలో వివాదానికి తెరలేచింది. పోలింగ్ ముగిసిన తర్వాత జిల్లాలో రాజ కుటుంబీకుల విజయావకాశాలపై సర్వత్రా చర్చ నడుస్తుండగా, వారి కుటుంబాల్లో మాత్రం కొత్త వివాదాలకు తెరలేచింది. కౌంటింగ్ తర్వాత వీరి భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.