Categories
Hyderabad

ఇంటర్ మంటలు : కోర్టులో ముగిసిన వాదనలు

ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఫెయిలైన విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామని ఇంటర్ బోర్డు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించారు. మే 8వ తేదీలోపు వివరాలు సమర్పించాలని..అనంతరం విచారిస్తామని కోర్టు వెల్లడించింది.

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల పత్రాలను కోర్టు ఎదుట పెట్టే విధంగా ఆదేశాలివ్వాలని తాను కోరినట్లు న్యాయవాది తెలిపారు. మే 8వ తేదీ లోపు వచ్చిన వివరాలను సమీక్షించి..ఇతర వాటిని పరిగణలోకి తీసుకుంటామని కోర్టు వెల్లడించిందన్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై జరిగిన తప్పులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమౌతున్నాయి. విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్‌ను అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అఖిలపక్ష నేతలు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. బీజేపీ నేత లక్ష్మణ్ నిరవధిక నిరహార దీక్ష చేపట్టారు.