Categories
Andhrapradesh Latest Political

జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ వెనుక అసలు కథ

జేసీ బ్రదర్స్‌కు సంబంధించిన మోటారు వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌పై నోట్‌
జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ. తాడిపత్రి

ఎలా గుర్తించారు?:
అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తుక్కు కింద విక్రయించిన వాహనాలను సేకరించిన తాడిపత్రికి చెందిన జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ వాటికి నకిలీ పత్రాలు సృష్టించి 2018లో వాటిని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ 68 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్‌ లీలాండ్‌ కంపెనీకి మెయిల్‌ చేయడం జరిగింది.

సంస్థ నుంచి సమాధానం:
అన్ని అంశాలను పరిశీలించిన కంపెనీ అదే నెల 23న అంటే, ఈ ఏడాది జనవరి 23వ తేదీన పూర్తి వివరాలు పంపించింది. కాలం చెల్లిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్‌ లీలాండ్‌ కంపెనీ తెలిపింది.

ఆ కంపెనీలు ఎవరివి?:
జఠాధర ఇండస్ట్రీస్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డికి చెందింది కాగా, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్‌రెడ్డికి చెందింది.

ఆ తర్వాత?
ఆ సమాచారం అందుకున్న తర్వాత రవాణా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించిన తర్వాత ఎన్‌ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించినట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి పూర్తి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల వివరాలు సేకరించగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

అక్రమాలు ఎలా?:
తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోరుతూ, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ తరపున జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జేసీ ఉమాదేవి దరఖాస్తుపై సంతకం చేశారు. ఆ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్‌ లీలాండ్‌ కంపెనీ ఇన్‌వాయిస్‌లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. అంతేకాకుండా అశోక్‌ లీలాండ్‌ కంపెనీ ఇచ్చిన ఇన్‌వాయిస్‌లను అసంపూర్తిగా సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్‌ పొందాయి. ఉత్తరాఖండ్‌లోని కళ్యాణ్‌పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్‌ లీలాండ్‌ కంపెనీలు ఆ ఇన్‌వాయిస్‌లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు.
బీఎస్-4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలను ఏప్రిల్‌ 1, 2017 నుంచి విక్రయించరాదని, అదే విధంగా ఆరోజు నుంచి వాటికి ఎక్కడా రిజిస్ట్రేషన్‌ చేయొద్దని గౌరవ సుప్రీంకోర్టు మార్చి 29, 2017న ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలు ఒకవేళ మార్చి 31, 2017 నాటికి విక్రయించి ఉంటే, వాటి రిజిస్ట్రేషన్‌కు మాత్రం కోర్టు మినహాయింపు ఇచ్చింది.

అంతులేని అక్రమాలు:
ఈ నేపథ్యంలో పై రెండు కంపెనీలు యథేచ్ఛగా మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించాయని తేలింది. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు చూపి, ఎక్కడో సుదూరంలో ఉన్న నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అంతేకాకుండా కేవలం కొద్ది రోజుల్లోనే వాటికి ఎన్‌ఓసీ సంపాదించి, ఇక్కడ అనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సొంత జిల్లా కావడంతో యథేచ్ఛగా ఆ వాహనాలు తిప్పారు. ఆ విధంగా వారు చీటింగ్‌కు పాల్పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, రహదారులపై తిరగడానికి ఏ మాత్రం అనువుగా లేని, తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించి జిల్లాలో తిప్పారు. రహదారి భద్రత లేకపోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యానికి కూడా కారకులయ్యారు. ఇంకా ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టారు.

పోలీసులకు ఫిర్యాదు:
వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం వన్ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేయడం జరిగింది. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరాము. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలను నకిలీ, తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించడం, వాటికి ఎన్‌ఓసి పొంది 2 రోజుల నుంచి 2 వారాల్లోనే అనంతపురంలో తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం ఇంకా వాటిని యథేచ్ఛగా జిల్లాలోనూ, దేశంలోనూ తిప్పడం కచ్చితంగా చీటింగ్‌కు పాల్పడడమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేయడమే.

ఇంకా ఏమేం చేశారు?
అంతేకాకుండా వాటిలో పలు వాహనాలను ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల విక్రయించాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీలపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే తుక్కు కింద బీఎస్-3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ మరో 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. వాటికి కూడా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నాయంటూ, బీఎస్‌-4 ప్రమాణాలతో కూడి ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వాటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ పేర్ల మీదే కాకుండా, కొన్ని వాహనాలను వ్యక్తిగత పేర్లతోనూ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆయా వాహనాల ఛాసిస్‌ నెంబర్లను పరిశీలించగా, అన్నీ బీఎస్-3కు చెందినవే తప్ప, బీఎస్-4 ప్రమాణాలతో కూడినవి కావని తేలింది. ఇదే విషయాన్ని అశోక్‌ లీలాండ్‌ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధరించారు. వాటన్నింటినీ బీఎస్-4 ప్రమాణాల వాహనాలుగా చూపడానికి నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించారు.

154 వాహనాల లావాదేవీల నిషేధం:
* రాష్ట్రంలో 101 వాహనాలు రిజిస్టర్‌ అయి ఉండగా, వాటికి సంబంధించి మరే లావాదేవీ జరగకుండా డేటా బేస్‌ బ్లాక్‌ చేయడం జరిగింది.
* 28 వాహనాలను ఇప్పటికే ఎన్‌ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపిచండం జరిగింది. ఆ వాహనాలపై ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్‌ చేయాలని అధికారుల కోరడమైంది. 
* ఇంకా మిగిలిన వాహనాలను ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. 

రిజిస్ట్రేషన్ల రద్దు:
* రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో 89 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం జరిగింది. 
* వాటిలో అనంతపురం జిల్లాలో 77 వాహనాలు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 5 చొప్పున, గుంటూరు జిల్లాలో మరో 2 వాహనాలు ఉన్నాయి.
* మిగిలిన వాహనాలకు సంబంధించి ఆర్‌సీ రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. 
* నెల్లూరు జిల్లాలో 6 వాహనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. అందువల్ల వాటి ఆర్‌సీ రద్దు చేయాలంటే హైకోర్టు అనుమతి కావాలి. అందుకే అధికారులు వేచిచూస్తున్నారు.
* ఇంకా కడప జిల్లాలో 3 వాహనాలు, అనంతపురం జిల్లాలో మరో 3 వాహనాల ఆర్‌సీలు రద్దు చేయాల్సి ఉంది. 

ఈ చర్యలు :
* మొత్తం 154 వాహనాలకు సంబంధించి ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా ‘వాహన్‌’ డేటాబేస్‌లో వాటిని బ్లాక్‌ చేయమని కోరుతూ రవాణా శాఖ జాయింట్‌ సెక్రటరీకి లేఖ    
* ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్‌ అయిన ఆ వాహనాల ఆర్‌సీల రద్దు కోసం ఆయా రాష్ట్రాలను కోరాలని అధికారులు నిర్ణయం
* ఆ వాహనాలు రహదారులపై కనిపిస్తే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులను కోరిన ఏపీ అధికారులు

వాహనాల స్వాధీనం:
* రాష్ట్రంలో నమోదైన్న 101 వాహనాల్లో ఇప్పటికే 60 వాహనాలు స్వాధీనం. ఇంకా మిగిలిన 41 వాహనాల ఆచూకీ తెలియాల్సి ఉంది.
* ఒక్క అనంతపురం జిల్లాలోనే 46 వాహనాలను స్వాధీనం. కడప, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 14 వాహనాలు స్వాధీనం. 

క్రిమినల్‌ కేసులు నమోదు:
ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో రవాణ అధికారి (డీటీసీ) 24 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అదే విధంగా కర్నూలు డీటీసీ మరో 3 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.
జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి చెందిన గోపాల్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసులు నమోదు. 

జేసీ ప్రభాకర్‌రెడ్డి మంతనాలు:
తమ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పలువురితో జేసీ ప్రభాకర్‌రెడ్డి మంతనాలు జరిపి, వారితో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఒక్కో వాహనానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు తిరిగి ఇస్తానని, అందువల్ల తమపై ఫిర్యాదు చేయవద్దని 35 వాహనాల యజమానులను ఆయన కోరినట్లు సమాచారం. అందువల్లనే ఆయా వాహనాలకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.

నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు:
నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్‌తోనే వారి అక్రమాలకు తెర పడలేదు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఇన్సూరెన్సు పత్రాలను కూడా వారు నకిలీవి ఆర్‌టీఏ అధికారులకు సమర్పించారు.
    
ఇంకా కేసులు ఫైల్‌ చేయాల్సి ఉంది:
ఆ విధంగా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు యథేచ్ఛగా బేఖాతరు చేయడం, ఫిట్‌నెస్, రోడ్‌ సేఫ్టీ లేకున్నా ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి వాహనాలను యథేచ్ఛగా రహదారులపై తిప్పడమే కాకుండా, చివరకు ఇన్సూరెన్సు పత్రాలు కూడా నకిలీవి సమర్పించిన ఈ రెండు కంపెనీలపై ఇంకా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉంది.

Categories
National

ఆర్థికమాంద్యం! : ప్రొడక్షన్ నిలిపివేస్తున్న అశోక్ లేల్యాండ్

ఆర్థికమాంద్యం కారణంగా పలు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఫ్లాంట్ లకు సెలవులు ఇచ్చేస్తున్నాయి. తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతోఇప్పటికే పలు సంస్థలు తమ ఫ్లాంట్ లకు తాత్కాలిక సెలవులు ఇచ్చి ప్రొడక్షన్ నిలిపివేయగా ఇప్పుడు ఆ జాబితాలో దేశీయ రెండవ అతిపెద్ద మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్ తయారీదారు అశోక్ లేల్యాండ్  చేరింది. తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతున్న కారణంగా ఈ నెలలో వివిధ ప్రాంతాల్లోని తమ ఫ్లాంట్ లలో  కొన్ని రోజులు నాన్ వర్కింగ్ డేస్(పని లేని దినాలు) గా పాటిస్తామని అశోక్ లేల్యాండ్  తెలిపింది. 

తమిళనాడులోని ఎన్నోర్ ఫ్లాంట్  16 రోజులు, హోసూర్1,2,సీపీపీఎస్ ఫ్లాంట్  5రోజులు, రాజస్థాన్ లోని అల్వాల్ ఫ్లాంట్  10రోజులు,మహారాష్ట్రలోని బాంద్రాలో 10రోజులు,ఉత్తరాఖండ్ లోని పట్నాఘర్ లోని ఫ్లాంట్ కు 18 రోజులు సెలవులు ఇస్తున్నట్లు అశోక్ లేల్యాండ్ ప్రకటించింది. మొత్తం అశోక్ లేలాండ్ వాహనాల అమ్మకాలలో  28% క్షీణించింది. గత ఏడాది జులై నెలలో 15,199 వాహనాలు అమ్ముడవగా,ఈ ఏడాది జులై లో 10,927 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి. మొత్తం దేశీయ అమ్మకాలు జులై నెలలో 10,101 యూనిట్లుగా ఉండగా, జూలై 2018 లో 14,205 యూనిట్లతో పోలిస్తే 29% తగ్గిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశీయ మార్కెట్లో మీడియం,హెవీ కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు జులై నెలలో 41% తగ్గి 6,018 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది అదే నెలల 10,152 యూనిట్లు నమోదైనట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది జులై నెలలో 4,053 యూనిట్లతో పోలిస్తే 2019 జూలైలో తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు 4,083 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులపై ప్రభుత్వం పునరుద్ధరించిన ఖర్చుల నేపథ్యంలో నిర్మాణ, మైనింగ్ ట్రక్కుల డిమాండ్ తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ కతురియా చెప్పారు.