Categories
Uncategorized

మంటపంలోనే విషాదం : తల్లి మరణాన్ని చెప్పకుండా కూతురికి పెళ్లి

అశ్వాపురం : కన్నకుమార్తె పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తల్లి కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. కన్నతల్లి చేతుల మీదుగా తన పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగే సమయంలో తల్లి మరణవార్త విన్న ఆ నూతన వధువు భోరుమంది. కాళ్ల పారాణి తడి ఆరకుండానే అన్నీ తానై పెంచిన కన్నతల్లి శవంపై పడి భోరున విలపించాల్సిన దుస్థితి ఆ నవ వధువుది. ఈ దారుణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చోటుచేసుకుంది. 
 

మరికాసేపట్లో కన్నకూతురి వివాహాన్ని కళ్లారా చూడాల్సిన ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. పెళ్లి ఆగిపోతుందనే భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టిన బంధుమిత్రులు..పెళ్లి తతంగాన్ని ముగించిన తరువాత కొత్త పెళ్లికూమార్తెకు ఆ దారుణం గురించి చెప్పారు. మూడు ముళ్లు పడగానే తల్లి మరణ వార్త తెలుసుకున్న ఆమె తల్లి మృతదేహం ముందు బోరున విలపిస్తుంటే చూసేవారి మనస్సుల్ని కలచివేసింది. ఆమెను ఓదార్చటం ఎవ్వరి వల్లా కాలేదు. 
 

బుడుగు బజారుకు చెందిన కటుకూరి నాగేంద్ర అనే 48 ఏళ్ల మహిళ భర్త గతంలోనే చనిపోయినా..అన్నీ తానై కుమార్తె ప్రవీణను పెంచి పెద్ద చేసింది. ప్రవీణకు ఫిబ్రవరి 28 గురువారం తెల్లవారుజామున మొండికుంటకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు అన్ని సిద్ధమయ్యాయి. దీంతో ప్రవీణతో సహా  బంధువులంతా  రాత్రి 11.30 గంటలకు అశ్వాపురం నుంచి కార్లలో బయల్దేరారు. వీరి కార్లు ముందుగానే వివాహ మండపానికి చేరుకోగా..ప్రవీణ తల్లి..ఇంకా ఇతర బంధుగణం ప్రయాణిస్తున్న కారు చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వధువు తల్లికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది. విషయం కుమార్తెకు చెబితే..పెళ్లికి అంగీకరించదనే ఆందోళనతో ప్రవీణకు విషయం చెప్పకుండానే వివాహాన్ని జరిపించారు. తరువాత విషయం తెలుసుకున్న ప్రవీణ తల్లి మృతదేహంపై పడి భోరున విలపించిన ఘటన అందరినీ కలచివేస్తోంది.