Categories
Political Telangana

ఆర్టీసీ సమ్మె : క్షీణిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న కార్మికులు.. 44వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇటు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 150, షుగర్ 196 ఉన్నట్లు తేల్చారు. వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోవాలని, ఆహారం తీసుకోవాలని అశ్వత్థామరెడ్డికి సూచించారు. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. 

ప్రభుత్వ వైఖరిపై అశ్వత్థామరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రధాన డిమాండ్‌ ఆర్టీసీ విలీనంను తాత్కాలికంగా వాయిదా వేసినా ప్రభుత్వం చర్చలు జరపకపోవడం దారుణమన్నారు అశ్వత్థామరెడ్డి. మరోవైపు దీక్షచేస్తున్న ఆర్టీసీ జేఏసీ కో – కన్వీనర్‌ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్‌లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. రాజిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

ఇదిలా ఉంటే నవంబర్ 18వ తేదీ సోమవారం హైకోర్టులో ఆర్టీసీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చర్చలకు పిలవమని, ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె చట్టవిరుద్ధమని తేల్చాలని వెల్లడించింది. దీంతో తీర్పు ఎలా వస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
Read More : దీక్ష భగ్నం : ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి