Categories
Latest Telangana

తెలంగాణ APPLE..రుచి చూసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి యాపిల్ పండ్లు పండించిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామ రైతు బాలాజీ తొలి కాతను సీఎం కేసీఆర్ కు అందచేశారు. 2020, జూన్ 02వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ కు వచ్చిన బాలాజీ..సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..సీఎంకు పండ్ల బుట్టను, మొక్కను అందించారు.

ఈ సందర్భంగా…సీఎం యాపిల్ ను రుచి చూసి..అక్కడున్న కొంతమందికి పండ్లను అందచేశారు. రెండు ఎకరాల్లో HR 99 యాపిల్ పంటను సాగు చేయడం జరిగిందని, ఈ విషయంలో ఉద్యానవన శాఖ చక్కటి సహకారం అందించిందని బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీని సీఎం కేసీఆర్ అభినందించారు. 

తెలంగాణ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది.. బతుకమ్మ, బిర్యానీ, బోనాలు..సంప్రదాయాలు. రాష్ట్రంలో ఎక్కువగా పండే పంటలు వరి, మొక్క జొన్న, మిర్చి..ఇతర పంటలు. కానీ ఇప్పుడు మరో పంట కూడా తెరమీదకు వచ్చేసింది. చల్లని వాతావరణంలో పండే ‘ఆపిల్’ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సాగు చేస్తున్నారు. త్వరలోనే ఈ పండ్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ యాపిల్‌ పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ధనోరాలో… బాలాజీ అనే రైతు యాపిల్‌ తోటను సాగు చేశారు. 

ఇక్కడ CCMB శాస్త్రవేత్తలు తమ వంతు ప్రోత్సాహం అందించారు. 2014 సంవత్సరంలో భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్ రకానికి చెందిన 150 మొక్కలను బాలాజీకి ఇచ్చారు. 2016లో వ్యవసాయ శాఖ మరో 300 మొక్కలు ఇచ్చారు. వీటిని నాటి..మూడు సంవత్సరాల కాసిన కాయలను కోయకుండా అలాగే చెట్టకు వదిలేశాడు. ప్రస్తుతం ఒక్కో కాయ 250 గ్రాములకు చేరినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ యాపిల్ ను తలపిస్తోంది. 

Read: విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు ఉప‌సంహ‌రించుకోవాలి…ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

Categories
Crime Telangana

సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 5వ అదనపు సెషన్స్ ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది.

ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ లో సమత హత్యాచారానికి గురైంది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సమతను గ్యాంగ్ రేపి చేసి గొంతుకోసి చంపేశారు. ఈ పని చేసింది తామే అని నిందితులు షేక్ బాబు, షాబోద్దీన్, మఖ్దూమ్ ఒప్పుకున్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. దిశ ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌భుత్వం వేగంగా స్పందించింది అన్నారు. స‌మ‌త కేసులో కూడా స‌త్వ‌ర న్యాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం శాంతి భ‌ద్ర‌త‌లకు అధిక ప్రాధ‌న్య‌తనిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దోషుల‌కు వెంట‌నే శిక్ష‌లు ప‌డేలా, భాదితుల‌కు స‌త్వ‌ర న్యాయ జ‌రిగేలా ప్ర‌భుత్వం త‌మ వంతుగా కృషి చేస్తుంద‌న్నారు. ఆడపిల్లల రక్షణ కోసం కేంద్రం కఠిన చట్టాలు తేవాలని మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘దిశ’ ఘటన కంటే కొద్దిరోజుల ముందు ‘సమత’ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమత అత్యాచారం చేసి చంపేసిన ముగ్గురు నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాబొద్దీన్ గతంలోనూ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఏ2 షేక్‌బాబును భార్య వదిలేయడంతో గ్రామంలో జులాయిగా తిరిగేవాడని, , ఏ3 షేక్ ముక్దుం చోరీ కేసులో జైలుశిక్ష అనుభవించి వచ్చాడని తెలుస్తోంది. వీరు ముగ్గురూ ముఠాగా ఏర్పడి అడవిలో కలప నరికి స్మగ్లింగ్ చేసేవారని స్థానికులు చెబుతున్నారు. షాబొద్దీన్ గతంలో కోలాంగూడలో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేయగా స్థానికులు దేహశుద్ధి చేసి గ్రామం నుంచి తరిమేశారని పోలీసుల విచారణలో తెలిసింది.

Categories
Uncategorized

విషాదం : ప్రాణహిత నదిలో గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్లు మృతి 

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. ఆదివారం (డిసెంబర 1) అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ్యమయ్యాయి. నదిలో చేపలు పట్టుకుంటున్న జాలర్ల వలకు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. 

మహారాష్ట్రలోని హాహిరి నుంచి చింతలమానేపల్లి మండలం గూడెంకు నాటుపడవలో ఆరుగురు అధికారులు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఆఫీసర్లు గల్లంతు అవ్వగా వీరిలో  నలుగురు అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా బాలకృష్ణ, సురేష్ లు ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై సమచాారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు నదిలో గాలింపు చర్యల్ని ముమ్మరం చేసారు. అయినా లభించలేదు. ఈ క్రమంలో నదిలో చేపలు పట్టుకునే జాలర్ల వలలకు గల్లంతైన ఆఫీసర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. 

Categories
Uncategorized

ప్రాణహిత నదిలో పడవ బోల్తా..ఆఫీసర్లు గల్లంతు 

అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్  బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. గల్లంతైన ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. 

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడటంతో ఫారెస్ట్  బీట్ ఆఫీసర్లు ఇద్దరు గల్లంతైయినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

మహారాష్ట్రలోని హాహిరి నుంచి గూడెంకు నాటుపడవలో ఆరుగురు అధికారులు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఆఫీసర్లు గల్లంతు అవ్వగా మరో నలుగురు అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
 

Categories
Telangana

ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఓ ఇంట్లోకి వెళ్లిన ఎలుగుబంటి గంటసేపు బీభత్సం సృష్టించింది. గ్రామస్తులంతా కలిసి ఎలుగుబంటిని తరిమికొట్టడంతో పంటపొలాల్లోకి పారిపోయింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎలుగుబంటిని అటవీ ప్రాంతానికి తరలించారు. ఎలుగుబంటి వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 
 

Categories
Uncategorized

పూర్వ వైభవం : తెరుచుకున్న పేపరు మిల్లు 

కాగజ్ నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉన్న సిర్పూరు పేపరు మిల్లులో మళ్లీ సందడి మొదలైంది. నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లు పునః ప్రారంభమైంది. మిల్లు ప్రారంభమైన  పదిహేను రోజుల్లోనే కాగితం తయారీ ఊపందుకుంది. పేపర్‌ ఎగుమతికి సిద్ధం అవుతోంది. నాలుగేళ్ళుగా బోసిపోయిన మిల్లు పరిసరాలు ప్రస్తుతం కర్ర దిగుమతి, పేపరు ఎగుమతులతో సందడి నెలకొంది. మూగబోయిన మిల్లు సైరన్ మళ్ళీ కూత కూస్తోంది. 

1938లో నిజాం కాలంలో స్థాపించిన ఈ మిల్లును 1950లో బిర్లా గ్రూప్ టేకోవర్ చేసింది. అప్పటి నుండి నిరాటంకంగా మిల్లులో ఉత్పత్తి కొనసాగింది. లాభాలు గడిస్తూ అద్భుతంగా నడిచిన మిల్లు.. గత యాజమాన్యం తప్పటడుగులతో తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. పేపరు మిల్లు సొమ్ముతో ఇతర బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టడంతో నష్టం వచ్చింది. దీంతో 2007-08 లో యాజమాన్యం బ్యాంకులలో రుణాలు తీసుకుంది. ఆ తర్వాత మిల్లులో నష్టాలు  చూపుతూ 27 సెప్టెంబరు 2014 న దీర్ఘకాలిక షట్ డౌన్ పేరిట మిల్లు ఉత్పత్తిని నిలిపివేసింది.  420 కోట్ల రూపాయల అప్పు చెల్లించాలని అక్టోబర్ 2016 లో మిల్లును ఐడిబిఐ బ్యాంకు స్వాధీనం చేసుకుంది.

పేపర్ మిల్లు మూతపడటంతో సుమారు నాలుగు వేల మంది కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధి లేక నాలుగేళ్ల పాటు వలస కూలీలుగా దుర్భరమైన జీవితాన్ని గడిపారు. మూతపడిన పేపరు మిల్లు పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్‌తో కార్మికుల సమస్యలను వివరించారు. అటు కేసిఆర్ ఇటు కేటిఆర్ లు మిల్లు పునరుద్ధరణ కోసం పట్టుబిగించారు. దీంతో మిల్లును తీసుకోవాడానికి జేకే పేపరు యాజమాన్యం ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా  2018, మార్చి 21 న పేపరు మిల్లుకు పలు రకాల రాయితీలు కల్పిస్తూ జీవో నెం.18ని విడుదల చేసింది. దీనికి తోడు 19 జూలై 2018 రోజున ట్రిబ్యునల్‌ తీర్పు కూడా మిల్లు పునరుద్ధరణకు అనుమతించింది. దీంతో మిల్లు తీసుకోవడానికి జేకే యాజమాన్యానికి మార్గం సుగమం అయింది.  2018 ఆగస్టులో జేకే యాజమాన్యం మిల్లును స్వాధీనం చేసుకొని మిల్లులోని యంత్రాలను మరమ్మతు చేయించింది.

ఇక 2019 ఫిబ్రవరి 7న….  7వ నంబర్‌ మిషన్‌లో పేపర్ ఉత్పత్తిని ప్రారంభించారు. కొద్ది రోజులలోనే పేపరు ఉత్పత్తి ఊపందుకుంది. ముందుగా పల్ప్ కొనుగోలు చేసి దాంతో పేపరు ఉత్పత్తి చేస్తున్నారు. చిప్పర్ హౌసింగ్ మరమ్మతులు పుర్తికాగానే ఇక్కడే పల్ప్ తయారు చేస్తామంటున్నారు అధికారులు. త్వరలోనే 8వ నంబర్‌ మిషన్‌ కూడా ప్రారంభించేందుకు జేకే యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ఇదే ఏడాదిలో మరో రెండు మిషన్లను కూడా ప్రారంభించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మూతపడ్డ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Categories
Crime

ప్రేమ నేరమా : ప్రేమ జంట ఆత్మహత్య

కొమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని వాంకిడి మండలంలో  విషాదం చోటు చేసుకుంది. గోయాగాం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. భరత్, గౌరు బాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇద్దరి ఇంట్లో తెలిసింది. కుటుంబ సభ్యులు వాళ్ల పెళ్లికి నిరాకరించారు. గౌరు బాయిని పేరెంట్స్ మందలించడమే కాకుండా చేయి కూడా చేసుకున్నారు. దీనితో కలిసి ఉండలేమని అనుకున్న గౌరు జనవరి 25వ తేదీ శుక్రవారం పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న భరత్ జనవరి 26వ తేదీ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంతో పాటు రెండు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.