Categories
National

కరోనా దెబ్బతో కళ తప్పిన పెళ్లిళ్లు 

నేటి నుంచి(28-05-2020) శుక్ర మూఢమి ప్రారంభమై జూన్ 10 వ తేదీ వరకు ఉంటుంది. అసలు మూఢమి అంటే గురు గ్రహం కానీ , శుక్ర గ్రహం కానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అని… వ్యవహారికంలోమూఢమి అని  అంటారు. శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము అని శాస్త్ర వచనం. ఈ టైమ్ లో వివాహా ముహూర్తాలు ఉండవు. 

హిందూ వివాహా వ్యవస్ధలో పెళ్ళికి చాలా పెద్ద తంతే ఉంది. చూపులతో మొదలై మూడు ముళ్లతో ముగుస్తుంది. పెళ్లికి అటు-ఇటూ ఉన్న బంధువర్గం అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. కొత్త జంట తోడూ-నీడగా నూరేళ్ల జీవితాన్ని గడపాలని ఆ రోజున ముక్కోటి దేవతలు వధవరులను దీవిస్తారని నమ్ముతారు. పంచ భూతాల సాక్షిగా ఇద్దరు ఒక్కటవుతారు. ఇప్పుడ కరోనా పుణ్యమా అని  అందరూ ముహూర్తాలను వాయిదా వేసుకున్నారు. 

ఒకటి అరా జరిగిన పెళ్లిళ్లకు వచ్చిన బంధు గణమే తక్కువ. మొత్తంగా అందరూ కలిసి 20 నుంచి 50 లోపే  ఉండటంతో ఆ సరదా కూడా లేకుండా పోయింది.  కరోనా దెబ్బతో  పెళ్ళి హంగామా తగ్గింది. ఒకవేళ పెళ్ళికి పిలిచినా వైరస్ భయంతో వచ్చే వారూ కరువవుతున్నారు. ఇక లాక్ డౌన్ కంటే ముందే కుదుర్చుకున్న వివాహాలు వైరస్ కారణంగా కొన్ని వాయిదా వేసుకోగా మరి కొందరు ఇంటివద్దే ఆర్భాటాలు లేకుండా పెళ్ళి తంతు ముగించేసారు. 

ఇక వాయిదా  వేసుకున్న పెళ్లిళ్లు  చేద్దామంటి దగ్గర్లో మంచి ముహూర్తాలు కూడా లేవని పండితులు చెపుతున్నారు. ఇప్పటికే పలు ముహూర్తాలు ముగిసిపోగా, ఇక గురు, శుక్ర మూఢాలు, అధిక అశ్వీయుజ మాసం, ఆషాఢం, భాద్రపదం తదితర కారణంతో శుభకార్యాలకు ఉన్న ముహూర్తాలు చాలా తక్కువ. సాధారణంగా వివాహ ముహూర్తాలకు వేసవి కాలంలో వచ్చే సెలవుల్లోనే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. స్కూళ్ళు కాలేజీలకు సెలవలు ఇవ్వటం  వాతావరణం అనుకూలంగా ఉండటం వల్లా అందరికీ కలిసొస్తుందని వీటికే ప్రాధాన్యం ఇస్తారు. 

ఈవేసవిలో చాలా ముహూర్తాలు ఉన్నా కరోనా వైరస్ తీవ్రత, లాక్ డౌన్ కారణంగా వివాహాలు వాయిదాలు పడటం జరిగింది. ఇక శుక్ర మూఢమిలో ముహూర్తాలు లేవు. జూన్ 10,11 తేదీల్లో ఒకటో రెండో ఉన్నా వారి వారి జాతకాల ప్రకారం అవి సూట్ అవ్వాలి. ఇక ఆ తర్వాత  నుంచి జులై 20 వరకు ఆషాఢ మాసం శూన్యమాసం కావటంతో ముహూర్తాలు ఉండవు. జూలై 23 నుంచి వరుసగా రెండు రోజులపాటు శుభముహూర్తాలు ఉన్నాయి. 

తిరిగి వారం రోజుల తర్వాత ఆగస్టు 2, 7, 8, 14వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో ఈ సమయం అత్యధిక శాతం శుభకార్యాలకు ఆసక్తి కనబర్చరు. ఇక ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. ఆ తర్వాత అక్టోబర్‌ 16వ వరకు నెల రోజులు అధిక అశ్వీయుజ మాసం, శూన్యమాసం కావడంతో మంచి ముహూర్తాలకు అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్‌ 21, 28, 29, 30, నవంబర్‌ 6, 11 నుంచి డిసెంబర్‌ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నా శుభకార్యాల కోసం పెద్దగా ఆసక్తి కనబర్చరు. 

మరోవైపు జూన్1వ తేదీ నుంచి మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగిస్తారనే వార్తల నేపధ్యంలో జూన్ నెలలో వచ్చే ముహూర్తాలకు ఎంత మంది వివాహాలు చేస్తారో అనేది కూడా అనుమానమే. గతంలో అనుకున్న విధంగా కాకపోయినా తక్కువ మంది బంధువులతో సరైన ముహూర్తానికే వివాహాలు జరిపించేందుకు కొందరు సిధ్దమవుతున్నారు. ఎందుకంటే పెళ్లి చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి తప్పని సరి అయ్యింది. 

ప్రభుత్వ  నిబంధనలకు లోబడి పెళ్లి జరిపించాలి. బ్యాండ్ మేళం ఉండకూడదు. బారాత్ లు లేవు. సామూహిక భోజనాలు లేవు. పరిమిత సంఖ్యలో  అతిథులను పిలవాలి. భౌతిక దూరం పాటించాలి. పెళ్లి జరిగే ప్రాంతాలన్నీ శానిటైజేషన్ చేయించాలి. పెళ్ళికి వచ్చిన వారంతా మాస్క్ లు ధరించాలి. వారందరికీ శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. ఇవన్నీ పాటిస్తామని హామీ ఇస్తేనే పోలీసు వారి నుంచి అనుమతి లభిస్తోంది.
 
కరోనా వైరస్  కారణంగా  విధించిన లాక్ డౌన్ తో పెళ్లిళ్లపై ఆధారపడి బతికే అనేక రంగాలకు చెందిన వందాలాది మందికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఆయా రంగాలపై ఆధారపడిబతికే వారి జీవనోపాధిపై ఇంతకు ముందెన్నడూ లేనంతగా ప్రభావం చూపుతోంది.  ఒక ఏడాదిలో ఉండే శుభముహుర్తాల టైంలోనే వారంతా బిజీగా ఉంటారు. మిగతా టైంలో వారంతా వేరే వేరే చిన్న, చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. 

ఫంక్షన్‌ హాల్స్, కల్యాణ మండపాలు,  పురోహితులు, డీజేలు, బ్యాండ్‌ బాజా, సన్నాయి మేళం,  క్యాటరింగ్, వంటలు వండే వారు, బంగారం, మేకప్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, టెంట్‌హౌస్, పెళ్లి బట్టలు,  ఫొటోలు, వీడియోగ్రాఫర్లు,  పూలు, పెళ్లిపందిరి, కూరగాయలు, ట్యాక్సీ వాళ్లు ఇలాగ ఒక పెళ్లి వల్ల  కొన్ని రంగాల్లోని వందల మంది ఉపాధి దెబ్బతిసినట్లయ్యింది. 

Read: క్వారంటైన్ సెంటర్ లో పెళ్లి చేసుకున్న ప్రేమజంట…ఇది కరోనా కాలం ట్రెండ్