Categories
Uncategorized

ఏపీ అసెంబ్లీ కమిటీల ప్రకటన : ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా కాకాని గోవర్దన్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కమిటీలను ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స్ కమిటీ, పిటిషన్స్ కమిటీ, అస్యూరెన్స్ కమిటీ, రూల్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. 

రూల్స్ కమిటీ చైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరిస్తారు. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి నియమించారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు సీనియర్ నేత అంబటి రాంబాబుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అస్యూ రెన్స్ కమిటీ చైర్మన్ గా కొట్టు సత్యనారాయణ, పిటిషన్స్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని నియమించారు.
 
కొద్ది రోజులుగా రాజకీయంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన వల్లభనేని వంశీకి రూల్స్ కమటీలో స్థానం కల్పించారు. అయితే రెండోసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సీనీ హీరో బాలకృష్ణకు మాత్రం అవకాశం దక్కలేదు. కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం బులెటిన్ విడుదల చేశారు.

అసెంబ్లీ రూల్స్ కమిటీ చైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా వైసీపీ నుండి సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించిన చిన అప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధర్ రెడ్డి, అప్పలనాయుడు తో పాటుగా టీడీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అవకాశం కల్పించారు. 

గత నెల 25న సీఎం జగన్ ను కలిసిన తరువాత వంశీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన టీడీపీ వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ఇప్పటికీ ఆయన స్పష్టత ఇవ్వటం లేదు. ఇక పిటీషన్ల కమిటీ ఛైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వ్యవహరిస్తారు. సభ్యులుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, కాసు మహేష్ రెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ నుండి ఏలూరి సాంబశివ రావు సభ్యులుగా ఉంటారు.