Categories
Andhrapradesh Political

ఇదేనా వైసీపీ వ్యూహం: లోకేశ్‌కు తప్పదా రాజకీయ నిరుద్యోగం?

శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాసనమండలి రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల అధికార పార్టీ విసిగిపోయినట్లుంది. మండలి సమావేశాలు ప్రారంభం నాటి కన్నా ముందే ప్రభుత్వానికి సహకరించకపోతే మండలిని రద్దు చేస్తామని లీకులిచ్చారు పలువురు మంత్రులు. అయినా ప్రతిపక్షం లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. టీడీపీ శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి లోకేశ్‌ను టార్గెట్‌గా చేసుకొని మండలి రద్దు నిర్ణయానికి అధికార వైసీపీ వచ్చిందని టీడీపీ అనుమానిస్తోంది.

లోకేశ్.. కీ రోల్ : 
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత లోకేశ్‌ యాక్టివ్‌గా ఉంటున్నారని, మండలిలో సైతం మిగిలిన సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారని వైసీపీ భావిస్తోందట. అందువల్లనే మండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గత సమావేశాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లు, ఇంగ్లిష్ మీడియం బిల్లులను తిప్పి శాసనసభకు పంపటంలో లోకేశ్‌ కీలకపాత్ర పోషించారు. శాసనమండలిలో వచ్చే ప్రతి చర్చలోనూ పాల్గొంటూ అధికార పక్షంపై విరుచుకు పడుతున్నారు. ఈ సమావేశాల్లో కూడా బిల్లులపై గంటపాటు సభలో ప్రసంగించారు లోకేశ్‌. అధికార పార్టీ నుంచి మంత్రులు ఎవరైనా విమర్శిస్తే వెంటనే స్పందిస్తూ వారికి కౌంటర్ ఇచ్చారు.

మండలి రద్దు చేస్తే :
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తర్వాత పార్టీకి నాయకత్వం వహించబోయే లోకేశ్‌ను రాజకీయ నిరుద్యోగిగా చేస్తే ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై పడుతుందని అధికార పార్టీ అంచనా వేసిందంట. అందుకే మండలి రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చిందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి లోకేశ్‌ ఓటమి చెందారు. దీనిపై అధికార పార్టీ నేతలు కొడుకుని కూడా గెలిపించుకో లేకపోయారని చంద్రబాబుని ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు.

మండలిని రద్దు చేయటం ద్వారా చంద్రబాబు మీద కూడా కక్ష సాధించవచ్చని వైసీపీ భావిస్తోందట. లోకేశ్‌ చట్టసభ  సభ్యుడు కావటం వల్ల ఎక్కడికి వెళ్లినా కొంత ప్రొటోకాల్ ఉంటుంది. మండలి రద్దు చేస్తే మాజీగా మాత్రమే లోకేశ్‌ మిగులుతారు. దాంతో పార్టీ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని వైసీపీ భావిస్తోందని ఆ పార్టీలో కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. మరి మండలి రద్దు ప్రక్రియ పూర్తవుతుందో లేదో చూడాలని అనుకుంటున్నారు.