Categories
National

బీజేపీ T షర్ట్ వేసుకుని రైతు ఆత్మహత్య

సమస్యలు వినే వారు లేక రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వంపై పెను ప్రభావం చూపించే అవకాశముంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 35ఏళ్ల రాజు తల్వారె అనే రైతు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్ ఎన్నికల ప్రచారంలో ఉన్న అదే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు పడుతున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే నిరసనతో బీజేపీ టీ షర్టు వేసుకుని చెట్టుకు ఉరివేసుకున్నాడని ఇంగ్లీషు మీడియా తెలిపింది. 

బుల్దానా ప్రాంతం నుంచి పోటీ చేసి గెలిచిన లేబర్ మంత్రి సంజయ్ కుటే నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో జరిగిన నష్టాలు రైతు మనుగడకు కష్టంగా మారింది. రెండు మూడేళ్లుగా పంట నష్టాలు సంభవించడం వల్ల మహారాష్ట్రలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రుణాల గురించి రైతులపై ఒత్తిడి తీవ్రం చేసింది.

Categories
Uncategorized

ఏపీలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : గోపాలకృష్ణ ద్వివేది 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు 46,397 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్లు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని 477 పోలింగ్ సెంటర్లను పెంచినట్లు ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరుగలేదన్నారు. 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఏపి అసెంబ్లీ  ఎన్నికల బరిలో 2,395 మంది అభ్యర్ధులు, పార్లమెంట్ బరిలో 344 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. ఓటరు ఎపిక్ కార్డులు పంపిణీ ఏప్రిల్ 7 వ తేదిలోగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇవిఎంలపై ఉన్న అపోహలను తొలగించేందుకు హైకోర్టు ఛీఫ్ జస్టిస్, ఇతర జస్టిస్ ల ఎదుట వాటి పనితీరును ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు. 

Categories
Uncategorized

ఏపీ బీజేపీకి అభ్యర్ధులు కావలెను

జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ  ఏపీలో మాత్రం పోటీ చేసే  అభ్యర్ధుల కోసం వెతుక్కునే పరిస్ధితి వచ్చింది. అటు టీడీపీ, ఇటు వైసీపీలోకి నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతారా అని కమలనాధులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదికూడా సీనియర్‌ నేతలు పార్టీలోకి వస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. 

ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. సీనియర్ నేతల కోసం సీరియస్‌గా అన్వేషిస్తున్నారు. అయితే కమలనాధుల గాలానికి అభ్యర్ధులు చిక్కుతారా..? లేదా అనేది చూడాల్సి ఉంది.  కాగా….. వైసీపీ  నుంచి పోటీ చేసే మొత్తం అభ్యర్ధులను పార్టీ ఆదివారం ప్రకటించింది. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇప్పుడు ఏదో ఒక పార్టీ లోమళ్ళీ ట్రై చేసే అవకాశం ఉంది.

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేవారి నుంచి గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రస్తుతానికి 25 లోక్‌సభ స్థానాలకు 196, 175 శాసససభ స్థానాలకు 673 వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇవి కాకుండా ఆన్ లైన్ ద్వారా మరికొన్ని దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తున్న కిలారు దిలీప్ ర్యాలీగా విజయవాడ నుంచి గుంటూరు వచ్చి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు దరఖాస్తు అందజేశారు. ఇక అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బీజేపీ మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్  కన్నాకు తెలిపారు.   

పార్లమెంట్ స్ధానాలకు వచ్చే దరఖాస్తుల కంటే అసెంబ్లీ స్ధానాలకు వచ్చే దరఖాస్తులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ తరపున పోటీ చేసేందుకు కాస్త ఆర్థిక స్తోమత కలిగినవారితో పాటు మధ్య తరగతి వర్గాలూ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వ్యాపార, ఇతర రంగాలకు చెందినవారు కూడా ఇందులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.జ్యోతి సుధాకర్ కృష్ణ ఏలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేశారు. ఏలూరు లోక్ సభ స్థానానికి బంగారం వ్యాపారి చక్కా సుబ్బారావు దరఖాస్తు చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, టింబర్ డిపో కార్యదర్శి బొల్లిశెట్టి వెంకట రామకృష్ణ కాకినాడ రూరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు. మార్చి 20వ తేదీ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తిచేయాలనుకుంటున్న బీజేపీకి అభ్యర్ధులు ఎంతవరకు దొరుకుతారో వేచి చూడాలి. 

Categories
Hyderabad

నేడే టి.అసెంబ్లీ ఆఖరు : లాస్ట్ స్పీచ్ కేసీఆర్

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగంపై చర్చ 
ఉభయసభల్లో వేర్వేరుగా సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కొప్పుల ఈశ్వర్‌
చివరగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం కొనసాగగా.. జనవరి 20వ తేదీ ఆదివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడనుంది. ఈనెల 17న సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. 
జనవరి 19వ తేదీ శనివారం ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ నరసింహన్‌… గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే.. మరోసారి అధికారంలోకి వచ్చామన్నారు. అంతేకాకుండా రాష్ట్రం చేపట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 
ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగాలు…
ఇక గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తొలుత అధికార పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతారు. ఆ తర్వాత పలువురు సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. చివరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతారు. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా సీఎం వివరిస్తారు. అలాగే రాబోయే ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారో కూడా తెలుపుతారు. ఇదిలావుంటే.. గవర్నర్‌ ప్రసంగం అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. సమైక్య రాష్ట్రంలో చేయని పనులను చేసినట్లు గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించేవారని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అయితే.. కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులు మాత్రం గవర్నర్‌ ప్రసంగంపై విమర్శలు చేస్తున్నారు. ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క.  గవర్నర్‌ ప్రసంగంపై నేతలు ఎలా స్పందిస్తారనేనది ఆసక్తికరంగా మారింది. 

Categories
Andhrapradesh Political

యువశక్తి : టీడీపీ నేతల వారసులొస్తున్నారు

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో  తెలుగుదేశం పార్టీలో యువ‌నాయ‌కులు పోటికి సై అంటున్నారు. తండ్రుల వారసత్వం ఆసరాగా ఎన్నికల్లో  గెలిచి ఎలాగైనా స‌రే అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. వీలైతే తండ్రుల‌తో పాటు త‌మ‌కి ఒక టికెట్ కావాల్సిందేన‌ని ఇప్ప‌టినుండే గ్రౌండ్  వర్క్ ప్రిపేర్  చేసుకుంటున్నారు టిడిపి యంగ్ టీమ్‌. మ‌రి చంద్ర‌బాబు ఒకే ఇంటిలో ఇద్ద‌రికి టికెట్ ఇవ్వ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతారా? లేదా ? అన్న మీ మాంస యువ‌నాయ‌కుల‌ను వేధిస్తోంది. మ‌రి బాబు నో చెబితే ….. చినబాబు లోకేష్ వెంట ప‌డ‌దాం అనుకున్నా, వారిపై చిన‌బాబుకు అంత సదభిప్రాయం లేద‌నేది పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  
పార్టీ వ్య‌వ‌స్ధాప‌క అధ్య‌క్షుడు య‌న్‌టిఆర్ పార్టీ స్ధాపించిన స‌మ‌యంలో టీడీపీలో యువ‌కుల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. య‌న్‌టిఆర్ స‌మ‌యంలో పార్టీలోకి వ‌చ్చిన వారంతా నేడు చంద్ర‌బాబు హ‌యాంలోనూ పార్టీలో సీనియ‌ర్స్‌గా కొన‌సాగుతున్నారు. అయితే నేడు సీనియ‌ర్ నేత‌ల వార‌సులు ఒక్కోరొక్కరుగా తెర‌పైకి వ‌స్తున్నారు. య‌న్‌టిఆర్ లాగా చంద్ర‌బాబు యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌నే అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు నియోజ‌క‌వ‌ర్గాల్లో తండ్రికి చేదోడు, వాదోడుగా ఉంటూ పార్టీ వ్య‌వ‌హ‌రాలు చూస్తూ  నియోజకవర్గంలో పట్టుసాధించిన యువ‌నాయ‌కులు అంతా ఇప్పుడు టికెట్ పై క‌న్నేశారు. వారికి నియోజ‌క‌వ‌ర్గాల్లో కాస్త గ్రిప్ దొర‌క‌గానే ఇప్పుడు స‌మ‌రానికి సై అంటున్నారు. వీలైతే ఇంట్లో ఇద్ద‌రికీ, లేదా క‌నీసం త‌మ‌కు అయినా టికెట్ కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో పోటికి లోకేష్ కూడా రెడీ అవుతుండ‌టంతో ఇక యువ‌నాయ‌కులు ఆయ‌న వెంట అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు.
ఉత్తరాంధ్రలో చూస్తే
జిల్లాల వారీగా చూస్తే శ్రీ‌కాకుళం జిల్లాలో సీనియ‌ర్ ఎమ్మెల్యే అయిన గౌతు శ్యామ‌సుంద‌ర్ శివాజి కుమార్తె అయిన గౌతు శిరీష వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె శ్రీ‌కాకుళం జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబుకి ఆమె తండ్రి శివాజి సైతం త‌న బ‌దులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెకు ఇవ్వాల‌ని కోరారు. విశాఖపట్నం పార్లమెంట్ సీటును దివంగత ఎంవిఎస్.మూర్తి మనవడు భరత్ ఆశిస్తున్నారు. ఇదే జిల్లాలో మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ పాత్రుడు వ‌చ్చే ఎన్నికల్లో పోటిపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు.ఇటివ‌ల కాలంలో పార్టీలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. ఎలాగూ అయ్య‌న్న‌పాత్రుడు అసెంబ్లీకి పోటిచేస్తారు కాబ‌ట్టి త‌న‌కి పార్ల‌మెంట్  టికెట్ కావాల‌నే డిమాండ్ తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు విజ‌య్‌పాత్రుడు. ఇక ఇదే జిల్లాలో మాజీమంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి కుమారుడు అప్ప‌లనాయుడు టికెట్ ఆశిస్తున్నారు. శ్రీ‌కాకుళం ఎంపి రామ్మోహ‌న్‌నాయుడుకి అప్ప‌ల‌నాయుడు బావ‌మ‌రిది కావ‌డం, ఒక‌వైపు త‌న తండ్రి ఎప్ప‌టి నుండో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉండ‌టంతో త‌న‌కి ఈసారి టికెట్ వ‌స్తే బాగుంటుంద‌ని ఆశిస్తున్నారు. ఇక విజ‌య‌న‌గ‌రంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజు కుమార్తె పేరు బాగా వినిపిస్తోంది. 
కోస్తా విషయానికి వస్తే 
తూర్పుగోదావరి  జిల్లాలో ఎమ్మెల్యే జోత్యుల నెహ్రు కుమారుడు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు వాసు లు టికెట్స్ ఆశిస్తున్నారు. ఇక ప‌శ్చిమ‌ంలో సీనియ‌ర్ నేత బోళ్ళ బుల్లిరామ‌య్య మ‌న‌వడు బోళ్ళ రాజీవ్ ఏలూరు ఎంపి టికెట్ ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లాలో దేవినేని అవినాష్‌, దేవినేని చందు ఇద్ద‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లాలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రామ్ టికెట్ ఆశిస్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లి, న‌ర్స‌రావుపేట రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ వ్య‌వ‌హ‌రాలు కోడెల శివ‌రామ్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగబాబు టికెట్ పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌కాశం జిల్లాలో సీనియ‌ర్ నేత, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ అయిన క‌ర‌ణం బ‌ల‌రామ్ కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ నియోజ‌క‌వ‌ర్గం అన్వేష‌ణ‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకి నుండి పోటిచేసిన వెంక‌టేష్ గోట్టిపాటి ర‌వి చేతితో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో గోట్టిపాటి ర‌వి టిడిపి గూటికి చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా అద్దంకి నుండి గోట్టిపాటి ర‌వికుమార్ పోటిచేస్తారు కాబ‌ట్టి క‌ర‌ణం వెంక‌టేష్ జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం కావాల‌ని ఇప్ప‌టినుండే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు. ఇక ఇదే జిల్లాలో మంత్రి శిద్దారాఘ‌వ‌రావు కుమారుడు శిద్దా సుధీర్ టికెట్ ఆశిస్తున్నారు.
రాయలసీమలో 
చిత్తురు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కుమారుడు బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి పోటికి సై అంటున్నారు. త‌న తండ్రికి ఆరోగ్యం స‌రిగా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటికి రెడీ అంటున్నారు. ఇక ఇదే జిల్లాలో ఇటివ‌లే మ‌ర‌ణించిన గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారులు గాలి జ‌గ‌దీష్‌, గాలి భాను ఇద్ద‌రు టికెట్‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఐతే ఇటీవ‌ల చంద్రబాబు నాయుడు ఇద్ద‌రినీ పిలిపించి మాట్లాడారు. వీరిలో భానుకు టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  అనంత‌లో మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ పోటికి సై అంటున్నారు. ప‌రిటాల సునీత బ‌దులుగా ఈసారి చంద్ర‌బాబు శ్రీ‌రామ్ కు టికెట్ ఇస్తార‌నే ప్రచారం  జోరుగా సాగుతోంది. ఇక ఇదే జిల్లాలో ఎంపి జేసి దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసి ప‌వ‌న్ కుమార్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత ఎంపిగా పోటిచేసే అవ‌కాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. జేసి నే అనేక సంద‌ర్బాల్లో  ఈ విష‌యం ప్ర‌క‌టించారు. ఇక ఈ సారి తాడిప‌త్రి నుండి జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి  కుమారుడు ఆస్మిత్ రెడ్డి పోటి చేస్తారు అని  వినికిడి. ఇక కర్నూల్ జిల్లాలో డిప్యూటి సియం కేఈ కృష్ణమూర్తి త‌న‌యుడు కేఈ శ్యామ్ పోటికి సై అంటున్నారు. కేఈ కృష్ణ‌మూర్తి సైతం త‌న కుమారుడు వైపే మొగ్గుచూపిన‌ట్లు తెలుస్తుంది. ఇదే జిల్లాలో రాజ్య‌స‌భ స‌భ్యులు టిజి వెంక‌టేష్ కుమారుడు టిజి భ‌ర‌త్ టికెట్ ఆశిస్తున్నా కొద్ది రోజుల క్రితం క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో లోకేష్ లేద‌ని తేల్చేశారు. దీంతో టిజి భ‌ర‌త్ పోటి నుండి కాస్త వెనక్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నిర్ణయం ఎటువైపు
ఎన్నికల్లో పోటీకి యువ‌నాయ‌కులు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. కానీ అధినేత చంద్ర‌బాబు వారిపై క‌రుణ చూపిస్తారా, లేదా అన్న సందేహం మ‌రోవైపు వారిని వెంటాడుతోంది. ఇంత క్లిష్ట ప‌రిస్దితుల్లో ఒకే ఇంట్లో ఇద్ద‌రికి టికెట్ అడిగితే చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో అన్న సందేహం వారిని వేధిస్తోంది. కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటికి దూరంగా ఉండాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌య‌సు రీత్యా కావ‌చ్చు…వేరే ఏద‌యినా కార‌ణం కావ‌చ్చు కానీ కొంద‌రు సీనియ‌ర్స్ అయితే పోటికి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయ్యారు. ఇదే విష‌యాన్ని  ఆనాయకులు తమ అభిప్రాయాన్ని ఇప్ప‌టికే చంద్ర‌బాబుకి చెప్పారు. చంద్ర‌బాబుకి చెప్ప‌డంతో పాటు త‌న బ‌దులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడికి టికెట్ ఇవ్వాల‌నే డిమాండ్‌ను బాబు ముందుంచారు. కాగా వీరిలొ కొంద‌రికి చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.
కొంత మంది విషయంలో చంద్ర‌బాబు టికెట్ ఇవ్వకపోతే, టికెట్ కోసం చిన‌బాబుని అయినా ఒప్పిద్దాం అనుకున్నా అక్క‌డ వారి ప‌ప్పులు ఏమి ఉడికేలా లేవు. చంద్ర‌బాబుని టికెట్ అడిగే ధైర్యం చేయ‌లేని యువ‌నాయ‌కులు చిన‌బాబు వెంట ప‌డుతున్నారు. అయితే చిన‌బాబు సైతం వారికి ఎలాంటి హామీ ఇవ్వ‌లేక‌పోతున్నారు. చంద్ర‌బాబుని కాద‌ని లోకేష్ సైతం ఎలాంటి హామీ ఇవ్వ‌లేరని తెలుసు. అయినా ఏదో ఒక ప్ర‌య‌త్నం చేద్దాం లే అని లోకేష్ చుట్టు తిరుగుతున్నారు యంగ్ టీం. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కొద్ది రోజులు లోకేష్ యువ‌నాయ‌కుల‌తో స్నేహంగానే ఉండేవారు. కానీ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల నుండి యువ‌నాయ‌క‌ుల‌పై వ‌స్తున్న‌ ఫిర్యాదుల‌తో కాల‌క్ర‌మేణ లోకేష్ సైతం వారితో అప్ప‌టినుండి ఇప్ప‌టివ‌ర‌కు అంటిముట్ట‌న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంద‌రి సిట్టింగ్‌ల‌కు టికెట్ లు ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం జ‌ర‌గుతున్న నేప‌ధ్యంలో అలా అయినా అదృష్టం వ‌రిస్తుందో ఏమో న‌ని గంపెడాశ‌లు పెట్టుకున్నారు యువ‌నాయకులు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా అయినా అసెంబ్లీలో అడుగుపెట్టాలని  తెగ ఆరాట‌ప‌డుతున్న టిడిపి యువ‌నాయ‌కుల ఆశ‌లు నెరవేరతాయో లేదో  వేచి చూడాలి మ‌రి.