Categories
Andhrapradesh Political

అమరావతి జోలికొస్తే సీఎం జగన్ రాజకీయ పతనం మొదలవుతుంది

ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక

ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అని నినదిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. జనవరి 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేవం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అంశంపై చర్చించి సీఎం జగన్ కీలక నిర్ణయం ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ అంతిమ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేసే రోజున… అంటే.. జనవరి 20న అసెంబ్లీ ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చింది. ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడించాలని సీపీఐ నేత రామకృష్ణ మందడం రైతులకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ పై రామకృష్ణ మండిపడ్డారు. సీఎం జగన్ ఒక గుదిబండలా తయారయ్యారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చి.. పక్కనున్న అక్రమ బిల్డింగ్ లు ఎందుకు కూల్చలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి జోలికొస్తే సీఎం రాజకీయ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. 18 మంది రైతులు చనిపోతే ఒక రోజైనా సీఎం పరామర్శించారా అని రామకృష్ణ నిలదీశారు.

పోలీసులు లేకపోతే సీఎం జగన్ బయటకురారు అని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఏపీలో ఉన్న ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. జగన్ కు ఆరవ వేలు లాంటి వారని, వారు ఎందుకూ పనికిరారు అని విమర్శించారు. అమరావతి ఉద్యమం దేశమంతా పాకిందని నారాయణ చెప్పారు. రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. శవాలపై పేలాలు ఏరుకునేలా జగన్ ప్రభుత్వం పనితీరు ఉందని నారాయణ విమర్శించారు.

అటు.. అమరావతిలో నిరసనలు సాగుతున్నాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతిలో రైతులు, జేఏసీ నేతల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటితో(16 జనవరి 2020) రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రులంతా ఒక్కటే.. రాజధాని అమరావతి ఒక్కటే.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. సంక్రాంతి పండుగ పూట మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంక్రాంతి పూట రాజధాని రైతులు పస్తు ఉన్నారు. రాజధానిని పరి రక్షించుకునేందుకు పండగ రోజు పస్తులు ఉండాలని నిర్ణయించుకున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో నిరాహారదీక్షలు కూడా చేస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో కూడా నిరసనలు సాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదన, అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపుని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.