Categories
Latest Life Style National

అసిస్టెంట్ కలెక్టర్ గా శ్రీధన్య, సివిల్స్ సాధించిన కేరళ తొలి గిరిజన అమ్మాయికి పోస్టింగ్

శ్రీధన్య సురేష్. పరిచయం అక్కర్లేని పేరు. 22ఏళ్లకే సివిల్స్ సాధించిన కేరళకు చెందిన తొలి గిరిజన అమ్మాయి.

శ్రీధన్య సురేష్. పరిచయం అక్కర్లేని పేరు. 22ఏళ్లకే సివిల్స్ సాధించిన కేరళకు చెందిన తొలి గిరిజన అమ్మాయి. శ్రీధన్యకు పోస్టింగ్ ఇచ్చారు. ఆమెను కోజికోడ్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా అపాయింట్ చేశారు. త్వరలోనే ఆమె విధుల్లో చేరనుంది. ఇప్పుడు శ్రీధన్య వయసు 26ఏళ్లు.

మూడో ప్రయత్నంలో సివిల్స్ లో ఉత్తీర్ణత:
కేరళకు చెందిన శ్రీధన్య సురేశ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2018 ఫలితాల్లో 410 ర్యాంకు సాధించింది. అత్యంత వెనుకబడిన ప్రాంతం వయనాడ్ నుంచి తొలిసారిగా సివిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన గిరిజన జాతికి చెందిన అమ్మాయిగా శ్రీధన్య చరిత్ర సృష్టించింది. రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు శ్రీధన్యను ప్రశంసించారు. శ్రీధన్యది కేరళలో అత్యంత వెనుకబడ్డ జిల్లా. కురుచియా అనే గిరిజన జాతికి చెందిన అమ్మాయి. ఆమె కమ్యూనిటీలో ఇంతవరకు ఐఏఎస్ పాస్ అయిన వారు లేరు. ఆ లోటుని శ్రీధన్య తీర్చింది.

అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్:
శ్రీధన్య ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణ పొందుతోంది. అసిస్టెంట్ కలెక్టర్ గా విధుల్లోకి జాయిన్ కావడానికి ముందు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. మానతవాడీ సబ్ కలెక్టర్ శ్రీరాం సాంబశివరావు ఆమెకు స్ఫూర్తి. ఆయనతో మాట్లాడాక సివిల్స్ ఆఫీసర్ కావాలని శ్రీధన్య లక్ష్యంగా పెట్టుకుంది. కష్టపడి చదివింది. అనుకున్నది సాధించింది. ఇప్పుడు సాంబశివరావు కోజికోడ్ కలెక్టర్ గా ఉన్నారు. తనకు స్ఫూర్తిప్రదాత అయిన వ్యక్తి కిందే ఆమెకు పని చేసే అవకాశం లభించడం విశేషం.

తల్లిదండ్రులు దినసరి కూలీలు, నిరుపేద కుటుంబం:
శ్రీధన్య కోజికోడ్ దేవగిరిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో డిగ్రీ చదివింది. కాలికట్ వర్సిటీ క్యాంపస్ లో పీజీ చేసింది. మూడో ప్రయత్నంలో సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించింది. శ్రీధన్యను కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసలతో ముంచెత్తారు. శ్రీధన్యను చూస్తే గర్వంగా ఉంటుందన్నారు. ఆమె విజయం యువతకు, మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి స్ఫూర్తిగా ఉంటుందన్నారు. శ్రీధన్య తండ్రి సురేష్, తల్లి కమల దినసరి కూలీలు. రోజంతా కష్టపడి పని చేస్తే కాని పూట గడవదు. అలాంటి కుటుంబంలో పుట్టిన ఆమె బాగా చదువుకుని ఉన్నత స్థానాన్ని అధిరోహించింది. శ్రీధన్య సోదరి ప్రభుత్వ ఆఫీస్ లో సర్వెంట్ గా పని చేస్తుంది. తమ్ముడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కృషి, శ్రమ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించింది  గిరిజన అమ్మాయి శ్రీధన్య సురేష్.