Categories
National

న్యూస్ ఛానల్ లో పనిచేసే 25మందికి కరోనా పాజిటివ్

జర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే ఇప్పుడు చెన్నైలో జర్నలిస్ట్ లకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగించే విషయం.

90మందికి పైగా శాంపిల్స్ తీసుకుని టెస్ట్ లు చేయగా దాదాపు 25మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27కి చేరుకోవచ్చని ఆ అధికారి తెలిపారు. కరోనా సోకినవాళ్లను ఒమదురర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చాలని ఆదేశాలను జారీ అయ్యాయని తెలిపారు. ఇటీవల చెన్నైలో టీవీ ఛానల్ లో పనిచేసే వ్యక్తితో సహా ఇద్దరు జర్నలిస్ట్ లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. 

అయితే పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ లకు కరోనా సోకుతుండటం చాలా దురదృష్టకరం అని భారత ప్రభుత్వం తెలిపింది. జర్నలిస్ట్ లు ఉన్న ప్రొటోకాల్స్ ఫాలో అవ్వాలని కేంద్రఆరోగ్యశాఖ సూచించింది. డ్యూటీకి హాజరైనప్పుడు జర్నలిస్ట్ లు అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని,సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని,ఫేస్ మాస్క్ నిబంధనలు పాటించాలని సోమవారం కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.