Categories
Crime National

రిపబ్లిక్ డే వేళ అసోంలో పేలుళ్లు

దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే… అసోంలో  ఉగ్రవాదులు గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల పేలుళ్లు జరిపి ఉనికి చాటుకున్నారు. 

ఆదివారం ఉదయం  అసోంలోని దిబ్రూగఢ్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో  పేలుళ్లు  జరిపారు. కాగా ఈ పేలుళ్ళలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దిబ్రూగఢ్ జిల్లాలోని గ్రాహమ్ బజారు వద్ద ఒకటి, ఏటీ రోడ్డులోని గురద్వారా వద్ద ఒకటి పేలుడు జరగ్గా, మరోకటిదిబ్రూగఢ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. చరైడియా  జిల్లాలోని సోనారికి సమీపంలోని టియాక్ ఘట్ టినియాలి సమీపంలోని ఒక దుకాణం ముందు మరోపేలుడు సంభవించింది. మరోకటి దులియాజాన్ పట్టణంలో జరిగింది.

ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు పేలుడు శకలాలను సేకరించారు.  చరైడియా జిల్లాలోని సోనారి ఘటనలో .. బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ గ్రేనైడ్ ఉంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుళ్లు నిషేధిత తీవ్రవాద సంస్ధ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అసోం ఇండిపెండెంట్ కు చెందిన పనిగా పోలీసులు భావిస్తున్నారు. రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాలని ఈసంస్ధ శనివారం పిలుపు నిచ్చింది.  గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య భారతదేశంలోని పలు తీవ్ర వాద సంస్ధలు గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిస్తు వస్తున్నాయి. 

 

Categories
Crime National

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదల్‌గురి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 15పై ఓరాంగ్‌ గెలబిల్‌  ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఆరుగురిని దిగంత సైకియా, పార్థా కురి, నారాయణ్ దాస్, రింకు సైకియా, రంజిత్ దేకా, పరిమ కురిగా గుర్తించారు.

ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించిన ఘటనపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Categories
National

అసోం కల్తీసారా ఘటన : 140కి చేరిన మృతులు.. 

అసోం : కల్తీ సారా తాగి మృతి చెందిన ఘటనలో మృతుల సంఖ్య 140 మందికి చేరారు.గోలాఘాట్‌, జోర్హాత్‌ జిల్లాల పరిధిలోకి వచ్చే తేయాకు తోటల్లో పని చేసే కూలీలు  గురువారం (ఫిబ్రవరి 21)రాత్రి ఓ వివాహ విందులో భాగంగా కల్తీ సారా తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతో మరికొందరు మృతి చెందారు. మరో 300ల మందికి పైగా  చికిత్స పొందుతున్నారు. 

వివాహ విందులో నాటు సారా తాగిన వందలాదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో స్థానికులు దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. తరలించే మార్గంలోనే 12 మంది మృతి చెందగా, మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కొనసాగుతోంది. 

కూలీలు తాగిన మద్యంలో కల్తీ తీవ్రంగా జరిగినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అందుకే మృతుల సంఖ్య తీవ్రంగా ఉందన్నారు.  ఈ ఘటనపై అసోం సీఎం శర్వానంద సోనోవాల్‌ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఎక్సైజ్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 90కి పైగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారుచేసే కేంద్రాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.