Categories
National

అసలు సినిమా ముందుంది : ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే

ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని ప్రధాని మోడీ అంటున్నారు. ముందు ముందు అసలు సినిమా చూపిస్తామని సినిమా డైలాగులు పేల్చారు. కేంద్ర

ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని ప్రధాని మోడీ అంటున్నారు. ముందు ముందు అసలు సినిమా చూపిస్తామని సినిమా డైలాగులు పేల్చారు. కేంద్ర తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని మోడీ స్పందించారు. ఇది తాత్కాలిక బడ్జెట్ మాత్రమే అని ప్రధాని కామెండ్ చేశారు. ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్ ట్రైలర్ మాత్రమే అని చెప్పారు. ఎన్నికల తర్వాత అభివద్ధి మంత్రంతో కూడిన బడ్జెట్ వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రకటించిన బడ్జెట్ అన్ని రంగాల్లో సంతృప్తినిచ్చిందని మోడీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించామన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందన్నారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగుగా అభివర్ణించారు.

 

ప్రజల కోరికల్ని ప్రభుత్వం నెరవేర్చగలిగిందని మోడీ అన్నారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన పెట్టుబడి సాయం పథకం(ప్రధానమంత్రి రైతు సమ్మాన్ నిధి)పైనా ప్రధాని స్పందించారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశ చరిత్రలోనే రైతుల కోసం తీసుకొచ్చిన అతిపెద్ద పథకం ఇదే అన్నారు. వేతన జీవులకు భారీ ఊరట ఇచ్చేలా ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచామని.. తద్వారా ఎన్నో ఏళ్లుగా వేతన జీవులు కోరుకుంటున్న దానిని మా ప్రభుత్వం చేసి చూపిందని మోడీ అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా 12 కోట్లమంది రైతులకు, 3కోట్ల మంది పన్ను చెల్లింపు దారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని అన్నారు. స్వచ్ఛ భారత్ ద్వారా 9 కోట్లమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

 

అసంఘటిత రంగ కార్మికులకు కొత్త పింఛన్‌ పథకాన్ని ప్రకటించడం ద్వారా వారికి అండగా నిలిచామన్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాంధన్‌ పేరుతో ప్రవేశపెట్టిన పథకం ద్వారా 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌ ఇస్తామన్నారు. నెలసరి ఆదాయం రూ.15వేల లోపు ఉండే వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌ అందుతుందన్నారు. అసంఘటిత రంగంలోని 10కోట్ల కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ప్రధాని మోడీ చెప్పారు. 29 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు వచ్చే వరకూ వారు నెలకు రూ.100 కట్టాల్సి ఉంటుంది. 18 ఏళ్లకే చేరితే నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకానికి ప్రభుత్వం రూ.500కోట్లు కేటాయించింది.