Categories
Political

రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానున్నారా. తెలంగాణ టీడీపీకి త్వరలో కొత్త నాయకత్వం రానుందా. జూ.ఎన్టీఆర్‌కి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తారా. అంటే అవుననే

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానున్నారా. తెలంగాణ టీడీపీకి త్వరలో కొత్త నాయకత్వం రానుందా. జూ.ఎన్టీఆర్‌కి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తారా. అంటే అవుననే అంటున్నారు  తెలంగాణ టీడీపీ నేత, ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. రెండేళ్లలో టీడీపీని బతికించుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డైమండ్ లాంటి లీడర్  వస్తారని చెప్పారు.

జూ.ఎన్టీఆర్‌ రెండేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తానని చంద్రబాబుకు చెప్పారని మెచ్చా తెలిపారు. జూ.ఎన్టీఆర్ వస్తే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఎన్టీఆర్  రాజకీయ అరంగేట్రంపై చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారని, కేడర్‌ను ధైర్యంగా ఉండమని చెప్పారని మెచ్చా వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అవుతాడని మెచ్చా  జోష్యం చెప్పారు.
Also Read : వీళ్లను మీరు ఎంతకు కొన్నారు: ఉత్తమ్‌కు కేటీఆర్ కౌంటర్

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య త్వరలో టీఆర్ఎస్‌లో చేరతానని ఆదివారం(మార్చి-3-2019) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో టీడీపీ తరఫున ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా  మెచ్చా నాగేశ్వరరావు నిలిచారు. మెచ్చా కూడా టీడీపీని వీడి కారు ఎక్కుతారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఈ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చిన నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.

పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా తాను టీడీపీని వీడబోనని మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయిస్తానని తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చారు. ఐదేళ్లలో రాష్ట్రంలో  టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు, సీఎంఓ సహా పెద్ద పెద్ద  వాళ్లు తనను పార్టీ మారాలని కోరిన మాట నిజమేనన్నారు. అయినా తాను పార్టీ మారబోనన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని మెచ్చా ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా  అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. తెలంగాణలో టీడీపీ నుంచి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో  సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇక మిగిలింది మెచ్చా మాత్రమే.
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

అసలే టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. తెలంగాణలో దాదాపుగా ఖాళీ అయ్యింది. చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో కేడర్ కూడా ఆశలు వదులుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా.. జూ.ఎన్టీఆర్ పేరుని తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. జూ.ఎన్టీఆర్‌కి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తారు అంటూ ఎమ్మెల్యే నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో డిస్కషన్‌కు దారితీశాయి. వాస్తవంగా చంద్రబాబు తీరు నచ్చక.. జూ.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చాలాకాలంగా దూరంగా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి తన సోదరి సుహాసిని టీడీపీ తరుఫున బరిలోకి దిగినా.. ఎన్టీఆర్ ప్రచారానికి రాకుండా దూరంగా ఉన్నారు. చంద్రబాబుతోనూ, తెలుగుదేశం పార్టీతోనూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి.. ఫ్యూచర్‌లో టీడీపీకి దగ్గరవుతాడా, టీడీపీ బాధ్యతలు స్వీకరిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ