Categories
Hyderabad

అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు

టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కూకట్ పల్లి డిపోలో పనిచేస్తున్న కోరేటి రాజు అనే ఆర్టీసీ డ్రైవర్ అశ్వత్థామరెడ్డిపై శుక్రవారం (అక్టోబర్ 25, 2019) కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనేక మంది కార్మికుల ఆత్మహత్యలకు ఆయన కారణమయ్యాడని ఆరోపించారు. 

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డ్రైవర్ చాలా అంశాలను ప్రస్తావించారు. ఆర్టీసీ సమ్మె పేరుతో నిర్వహిస్తున్న ధర్నాలతో కార్మికులు నష్ట పోతున్నారని తెలిపారు. వారందరినీ రెచ్చగొడుతున్నారని తెలిపారు. ప్రభుత్వంతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించ కలిగితే ఆత్మహత్యలు జరిగిఉండేవి కావని.. పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీకి అండగా ఉండకపోతే చాలా మంది రోడ్డుపై పడే పరిస్థితి వస్తుందన్నారు. సమ్మె అనే మాటను పక్కన పెట్టి విధులకు హాజరు కావాలని మీడియా ద్వారా సీఎం పిలుపు ఇచ్చారని తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని వదులు కోవద్దని..విధులకు హాజరు కావాలని సూచించారు. 

ప్రాక్టికల్ గా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ రెండు పేజీలతో ఉన్న ఫిర్యాదులో వెల్లడించారు. నాయకులు చెబుతున్న మాటలు కాకుండా గ్రౌండ్ లెవల్ లో ఉన్న విషయాలు ఏమిటన్నవి ఈ ఫిర్యాదుతో తెలుస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు అశ్వత్థామరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.