Categories
Crime

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయం

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గోల్ మాల్ జరిగింది. ఆలయంలో మూడు కిరీటాలు మాయం అయ్యాయి.

చిత్తూరు : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గోల్ మాల్ జరిగింది. ఆలయంలో మూడు కిరీటాలు మాయం అయ్యాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతిలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించిన మూడు కిరీటాలు అదృశ్యమయ్యాయి. అయితే ఇవాళ ఉదయమే కిరీటాలు మాయమయ్యాయా? ఇదివరకే మాయమయ్యాయా? తెలియరాలేదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. అధికారులు, పోలీసులు సీపీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

 

టీటీడీ యంత్రాంగం మొత్తం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంది. ఈ ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఈనేపథ్యంలో ఈ మూడు కిరీటాలు ఎలా మాయం అయ్యాయి? అర్చకుల ప్రమేయం ఉందా? సిబ్బంది ప్రమేయం ఉందా? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయంలో తనిఖీలు చేస్తున్నారు. 

 

నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న కోదండరామ ఆలయంలో ఇదే తరహాలో అర్చకుడు స్వామి వారి నగలు మాయం చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ కేసు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఈనేపథ్యంలో ఇప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం తీవ్ర కలకలం రేపుతోంది. నిజానికి కిరీటాలు ఎప్పుడు మాయం అయ్యాయి? ఎలా మాయం అయ్యాయి? ఎవరు మాయం చేశారు? అన్న విషయం తేలాల్సివుంది.

 

టీటీడీ జేఈవో పోల భాస్కర్, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, టీటీడీ ముఖ్య భద్రతాధికారి ఆలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. కిరీటాల అదృశ్యంపై విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కిరీటాలు ఆలయం నుంచి బయటికి వెళ్లాయా? అర్చకుల ప్రమేయం ఉందా? అన్న కోణంలో ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసివేశారు.