Categories
71706 71715 71723

ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు ఏ దేశం ఎంత ప్యాకేజీ ఇచ్చిందంటే

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి మోడీ సర్కార్‌ భారీ ప్యాకేజీ

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి మోడీ సర్కార్‌ భారీ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆత్మ నిర్బర భారత్ అభియాన్ పేరుతో ఏకంగా 20లక్షల కోట్ల ప్రత్యేక బాహుబలి ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధికంగా ఖర్చు పెట్టిన జీ-20 దేశాల్లో 5వ స్థానంలో నిలిచింది. ఒక మన దేశమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు ఇలానే చేశాయి. కరోనాతో కుదేలైన తమ దేశ ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి భారీగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడమే లక్ష్యంగా ఒకరు ప్యాకేజీ ప్రకటిస్తే స్వయం ఉపాధికి పెద్ద పీట వేస్తూ మరో దేశం రిలీఫ్ ప్యాకేజీ అనౌన్స్ చేసింది. మరో దేశం ఆరోగ్య రంగ ఉత్తేజంపై ఫోకస్ పెట్టింది. ఇలా ఒక్కో దేశం ఒక్కో రీతిన ఆర్థిక ప్యాకేజీలు అనౌన్స్ చేశాయి. ఇంతకీ ఏ దేశం ఎంత ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది అనే విషయాన్ని పరిశీలిస్తే..

కరోనా సాయంలో 19వ స్థానంలో భారత్:
ప్రపంచవ్యాప్తంగా కరోనా సాయంలో చూసుకుంటే హాంకాంగ్‌తో కలిసి భారత్‌ 19వ స్థానాన్ని పంచుకుంది. 2008 ఆర్థిక మాంద్యం కంటే అధికంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమైపోవడంతో సహాయ ప్యాకేజీలే భవిష్యత్‌కి బాటలు వేసేలా రూపొందించాయి. హాంకాంగ్, కోస్టారికా, కెనడా వంటి దేశాలు ఉద్యోగాలు కోల్పోయిన వారికి నగదు రూపంలో సాయం చేశాయి. నెదర్లాండ్స్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తుల 90 శాతం వరకు వేతనాలను ప్రభుత్వమే పరిస్థితి చక్కబడే వరకు చెల్లించేలా ప్యాకేజీ రూపొందిస్తే, ఫ్రాన్స్‌ ఉద్యోగుల గ్రాస్‌ వేతనంలో 84శాతం చెల్లిస్తోంది.  

దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించిన అమెరికా:
కరోనాతో దెబ్బతిన్న అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించింది. రెండున్నర లక్షల కోట్లకుపైగా డాలర్లతో ఆర్థిక వ్యవస్థకి ఊపిరిలూదడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మూడు దశల్లో ఖర్చు పెట్టిన అమెరికా నాలుగో దశ విడుదలపై కసరత్తు చేస్తోంది. కరోనా ఎయిర్‌ రిలీఫ్‌ అండ్‌ ఎకనామిక్‌ స్టిమ్యులస్‌ ప్యాకేజీ (కేర్స్‌) పేరుతో దీనికి అమెరికా సెనేట్‌ అంగీకరించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోవిడ్‌ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు, విద్యార్థుల ఉన్నత విద్యా రుణాలు మాఫీ, ఫుడ్‌ బ్యాంకులు, కోవిడ్‌పై పరిశోధనలు, వ్యాక్సిన్‌ అభివృద్ధి వంటి వాటిపై అమెరికా భారీగా నిధుల్ని భారీగా వెచ్చించింది.

స్వయం ఉపాధికి పెద్ద పీట వేసిన యూకే:
బ్రిటన్‌ స్వయం ఉపాధికే తన రిలీఫ్‌ ప్యాకేజీలో పెద్ద పీట వేసింది. సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకుంది. కోవిడ్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి స్వయం ఉపాధి కల్పించే పథకాలు ప్రవేశపెట్టింది. వ్యాపారాలు చేసే వారికి రుణాలు మంజూరు చేసింది. కోవిడ్‌ మళ్లీ విజృంభించే సంకేతాలు ఉండడంతో భవిష్య నిధికి కొంత కేటాయింపులు జరిపింది.  

ఆరోగ్య రంగ ఉత్తేజంపై ఇటలీ ఫోకస్:
ఇటలీ తన ప్యాకేజీలో ఆరోగ్య రంగ ఉత్తేజంపైనే దృష్టి పెట్టింది. కంపెనీల్లో శుభ్రత, శానిటైజేషన్, ఉద్యోగులకు మాస్క్‌లు వంటివి కల్పించడం కోసం 50శాతం పన్నుల్లో మినహాయింపునిచ్చింది. చిన్నారుల సంక్షేమం, ప్రజలు కట్టాల్సిన పన్నుల మినహాయింపు వంటి చర్యలు తీసుకుంది.

స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా కెనడా ప్యాకేజీ:
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న కెనడా సహాయ ప్యాకేజీ కేటాయింపుల్లో ప్రశంసలందుకుంది. చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి 75% అద్దె తగ్గింపు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులు, సేవా రంగంలో ఉండేవారిని ఎక్కువగా ఆదుకుంది. అంతే కాకుండా స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ప్యాకేజీని రూపొందించింది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ దేశం నెలకి 2 వేల కెనడా డాలర్ల చొప్పున నాలుగు నెలలు నిరుద్యోగ భృతి కింద ఇస్తోంది.  

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. 215 దేశాలకు కరోనా వ్యాపించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 44లక్షల 12వేల 906మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 2 లక్షల 96వేల 525మంది కరోనాతో చనిపోయారు. మన దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు మన దేశంలో 78వేల 55 కరోనా కేసులు నమోదయ్యాయి. 2వేల 551 మంది కరోనాతో చనిపోయారు. 

Read More:

* కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ పేదలకు పనికిరాదు: చిదంబరం

ఇక గ్లోబల్ టెండర్లు లేవు.. రూ. 200కోట్ల లోపు కొనుగోళ్లు భారత్‌లోనే!