Categories
National

ఆయన ఓ రోల్ మోడల్ : సాధ్వి వ్యాఖ్యలపై కర్కరే కూతురు

26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర మాజీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరేపై భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తన శాపం వల్లే కర్కరే చనిపోయాడంటూ సాధ్వి చేసిన వ్యాఖ్యలపై తొలిసారిగా కర్కరే కూతురు నవరే స్పందించారు.

అమెరికాలో నివసిస్తున్న నవరే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన తండ్రి,26/11 హీరోపై సాధ్వి వ్యాఖ్యలు హుందాగా లేవన్నారు. హేమంత్ కర్కరే ఒక రోల్ మోడల్ అని, ఆయన పేరు ప్రస్తావించేటప్పుడు హుందాగా వ్యవహరించాలని ఆమె కోరారు.అన్నింటికంటే  దేశమే ముఖ్యమని, అదే అందరి ప్రధాన బాధ్యత కావాలని తమ తండ్రి ఎప్పుడూ చెప్పేవారన్నారు. వ్యక్తిగత జీవితం,కుటుంబం కన్నా తన తండ్రి  యూనిఫాంనే ఎక్కువగా ప్రేమించేవారని, అందుకోసం తన ప్రాణాలను పణంగా పెట్టారని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని తాను కోరుతున్నానని చెప్పారు. ఉగ్రవాదానికి మతం లేదని తమకు కర్కరే చెప్పేవారని నవరే గుర్తుచేసుకున్నారు.తన తండ్రి ప్రాణాలు విడిచే చివరి క్షణంలో కూడా తన ముంబై నగరాన్ని,తన దేశాన్ని కాపాండేందుకు తపించారని ఆమె గుర్తుచేసుకున్నారు.