Categories
Crime

మంచం దగ్గర గొడవ : అత్తకు నిప్పంటించిన అల్లుడు

వారిద్దరూ భార్యాభర్తలు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. తల్లిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం భర్త అత్తింటికి వెళ్లాడు. సీన్‌ కట్‌

వారిద్దరూ భార్యాభర్తలు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. తల్లిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం భర్త అత్తింటికి వెళ్లాడు. సీన్‌ కట్‌ చేస్తే.. ఓ చిన్న విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. చినికి చినికి ఆ గొడవ గాలివానలా మారింది. గొడవను సద్దుమణిగించడానికి యత్నించిన అత్తపై ఏకంగా పెట్రోల్‌ దాడికి యత్నించాడు. ఇంతకీ ఆ దంపతుల మధ్య తలెత్తిన వివాదమేంటి..? ఎందుకు అంతలా రెచ్చిపోయాడు…?

ప్రాణం తీస్తున్న క్షణికావేశం:
కొందరు క్షణికావేశానికి లోనై ఏకంగా మనషుల ప్రాణాలనే తీసేస్తున్నారు. తమ అనుకునే వాళ్ళ జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్యపై కోపంతో అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ…ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది.

తల్లికి సేవ చేయడానికి వచ్చిన కూతురు:
అనంతసాగరం మండలం గౌరవరానికి చెందిన లక్ష్మమ్మకి ఒక్కగానొక్క కుమార్తె జయమ్మ. కూతురికి కొంతకాలం క్రితం వివాహం జరిపించింది. అయితే ఇటీవల లక్ష్మమ్మ అనారోగ్యానికి గురైంది. తల్లి లక్ష్మమ్మను చూడటానికి ఆమె కుమార్తె జయమ్మ పుట్టింటికి వచ్చింది. తల్లికి సేవలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. భార్య జయమ్మ తిరిగి రాకపోవడంతో భర్త అత్తింటికి వెళ్లాడు. అంతా కలిసి కాసేపు కాలక్షేపంగా గడిపారు. 

అత్త లక్ష్మమ్మపై పెట్రోల్ పోసి నిప్పు‌:
సాయంత్రం సమయంలో వెంకటరమణ మంచం విషయంలో భార్యతో గొడవపడ్డాడు. ఆ గొడవను సద్దుమణిగించడానికి లక్ష్మమ్మ ప్రయత్నించింది. మా మధ్యలోకి నువ్వు ఎందుకు వచ్చావు అంటూ అత్తమీద కోపంతో ఊగిపోయాడు. వెంటనే తన బైక్ లోని పెట్రోల్ చేసి అత్త లక్ష్మమ్మ ఒంటిపై పోశాడు. అనంతరం నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మమ్మను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

బాధితురాలు లక్ష్మమ్మ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక కేవలం మంచం విషయంలో జరిగిన గొడవకు పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది.