Categories
Uncategorized

10టీవీ ఎఫెక్ట్ : యువకుల్ని కొట్టిన పోలీసులపై ఐజీ సీరియస్..చర్యలు  

10టీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో యువకుల్ను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి సీరియస్ అయ్యారు.వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ ఆదేశించారు.  యువకులను కొట్టిన ఘటనలో నలుగురు పోలీసులను ఎస్పీ రాహుల్ హెగ్డే ఎటాచ్ చేయటంతో వారిపై ఐజీ చర్యలకు ఆదేశించారు.
 
కాగా..రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో న్యూఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా నలుగురు యువకులు మద్యం తాగారు. దీంతో పోలీసులు వారిని నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. ఈ దృశ్యాలను 10టీవీ ఎక్స్ క్యూజివ్ గా చిత్రీకరించి ప్రసారం చేసింది. ఇది ఐజీ నాగిరెడ్డి దృష్టికి వెళ్లటంతో ఆయన వెంటనే స్పందించారు. వెంటనే యువకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశించారు.  

Categories
National

చిన్నమ్మకు ఐటీ షాక్

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిషృత అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మరో షాక్ తగిలింది. శశికలకు చెందిన 1,600 కోట్ల రూపాయల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఐటీ అధికారులు జప్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో పెద్ద నోట్ల సొమ్ముతో శశికళ కుటుంబ సభ్యులు చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరులో తొమ్మిది రకాల ఆస్తులను కూడబెట్టారన్న సమాచారంతో ఐటీ శాఖ దాడులు చేసినట్లు తెలిసింది. జప్తు చేసిన ఆస్తుల్లో పెరంబూర్‌లోని ఓ మాల్, ఓ రిసార్ట్, కోయంబత్తూర్‌లో ఉన్న ఓ పేపర్ మిల్, చెన్నైలో గంగ ఫౌండేషన్ పేరుతో ఉన్న స్పెక్ట్రమ్ మాల్, పుదుచ్చేరిలో శ్రీలక్ష్మి జువెలరీ పేరుతో ఉన్న ఓ రిసార్ట్‌ ఉన్నట్లు తెలిసింది. శశికళ శిక్ష అనుభవిస్తున్న బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు కూడా ఈ జప్తుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పంపారు.

2017 నుంచి అక్రమాస్తుల కేసులో శశికళ  జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగా చెన్నై, కోయంబత్తూర్, పుదుచ్చేరితో పాటు 37 ప్రాంతాల్లో శశికళ ఆస్తులపై రెండేళ్ల క్రితం ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శశికళ ఇంట్లో పని చేసే సిబ్బంది పేర్లపై, కారు డ్రైవర్లు, అసిస్టెంట్ల పేర్లపై బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు.  

జయలలిత బతికి ఉన్నప్పుడు చిన్నమ్మగా శశికళ చక్రం తిప్పారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే మీద పట్టుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినా.. ఆ తర్వాత పన్నీరు సెల్వం, పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే.

Categories
Uncategorized

రిపోర్ట్ టూ HQ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ 

హైదరాబాద్ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావును బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఇంటెలిజెన్స్ డీజీను ప్రభుత్వం బదిలీ చేసింది. 

హైకోర్టు తీర్పు క్రమంలో ఈసీ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వెంకటేశ్వర్‌రావును పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని కూడా ఆదేశించింది. అంతకుముందు సీఎం చంద్రబాబుతో ఏబీ వెంకటేశ్వరరావు సమావేశం అయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై ఈసీ చర్యలు తీసుకుంది.

ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికారుల బదిలీపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారుల బదిలీ సరికాదని.. ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
 

Categories
National

నీరవ్ పై ఈడీ కొరడా : రూ.148 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

 13 వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ముంబై, సూరత్ లోని   రూ.147.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మంగళవారం(ఫిబ్రవరి-26,2019)ఈడీ అటాచ్ చేసింది. ఈడీ స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది ఖరీదైన కార్లు,మెషినరీ,ఓ ప్లాంట్, జ్యూవెలరీ, పెయింటింగ్స్ తో పాటు స్థిరాస్థులు కూడా ఉన్నాయి. నీరవ్ మోడీ గ్రూప్ కు చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్,రదీషిర్ జ్యూవెలరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్,రిథమ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ లకు చెందిన స్థిరాస్తులను ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002 కింద అటాచ్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. భారత్, విదేశాల్లోని రూ.1,725.36కోట్ల విలువైన నీరవ్ కు చెందిన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ స్వాధీనం చేసుకుంది.