Categories
International

జర్మనీలో ఉన్మాది కాల్పులు..తొమ్మిది మంది మృతి : తల్లిని కూడా చంపేశాడు

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనావులో బుధవారం (ఫిబ్రవరి 20,2020)జాత్యహంకార భావాలు గల ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. హనావులోని హుక్కాబార్‌లో కాల్పులు జరిపిన ఆ ఉన్మాది.. తరువాత పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. 

హుక్కాబార్‌లో ఓ ఇంటి డోర్‌ కాలింగ్ బెల్‌ కొట్టాడని..తలుపు తెరుచుకోగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని చెప్పారు. ఆ తరువాత అక్కడి నుంచి ఓ కారులో పారిపోయి ‘అరేనా బార్‌ అండ్‌ కేఫ్‌’కు చేరుకుని అక్కడ కూడా తన ఉన్మాదాన్ని చూపించాడు. దాదాపు 12మందిపై కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాల్పుల విషయం తెలియగానే సాయుధ భద్రతా బలగాలు నగరాన్ని చుట్టుముట్టాయి. ఈ దాడిని  ఉగ్రదాడిగా భావించిన అధికారులు..తక్షణం భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. హెలికాప్టర్లతో నగరాన్ని జల్లెడ పట్టారు.  

సీసీటీవీ కెమెరాల సహాయంతో దుండగుడు ప్రయాణించిన కారును వెంబడించగా, ఇంటి వద్ద తన తల్లితోపాటు అతడు విగతజీవునిగా కనిపించాడని..అని వయస్సు 43ఏళ్లు అనీ అతని తల్లి వయస్సు 72ఏళ్లు ఉంటాయనీ జర్మనీలోని హెస్సీ రాష్ట్ర మంత్రి పీటర్‌ బ్యూత్‌ చెప్పారు. ఉన్మాదంతోనే సదరు వ్యక్తి కాల్పులు జరిపి ఉంటాడని తెలిపారు. ఆ ఉన్మాది ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 72 ఏండ్ల తల్లిని కూడా కాల్చి చంపినట్టు తెలుస్తున్నదని అన్నారు. దుండగుడిని టోబియాస్‌గా గుర్తించారు. 

ఉన్మాదికి సంబంధించిన వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే అతడు జాత్యహంకారి అని..విదేశీయులంటే అతడికి ఇష్టం ఉండేది కాదని తెలుస్తోందని మంత్రి తెలిపారు. 24 దేశాల వారిని నిర్మూలించాలని అతడు కొన్ని పేపర్స్ పై రాసుకున్నాడని తెలిపారు. ఉన్మాది దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని..గాయపడిన వారిలో కొందని పరిస్థితి విషమంగా ఉందన్నారు. జాత్యహంకారంతోనే అతడు కాల్పులు జరిపినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది టర్కీ దేశస్థులు, కుర్ద్‌ సంతతికి చెందిన వారని తేలింది.