Home » తమిళనాడులో విలేకరి దారుణ హత్య
Published
2 months agoon
By
murthyTamil Nadu Journalist hacked to death : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. విలగం దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న నాగరాజు అనే తెలుగు వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హనుమంతనగర్ లో నివసించే నాగరాజు(45) ఆదివారం ఉదయం గం.8-30 సమయంలో మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఆసమయంలో గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు అతడ్ని ఆపారు.
వారు వెంటనే ఆయనపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు ఇంటిలోకి వెళ్లబోగా దుండగులు వెంబడించి ఆయన్ను హతమార్చారు. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిననాగరాజు 15 ఏళ్ల క్రితం హోసూరు వచ్చి స్ధిరపడ్డాడు. జర్నలిస్ట్ గా పని చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు.
నాగరాజు తమిళనాడు హిందూ మహా సభ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మరో వైపు నాగరాజు ఇటీవల రియల్ ఎస్టేట్ కు సంబంధించి కొన్ని కధనాలు కూడా తన దినపత్రికలో ప్రచురించాడనే సమాచారం ఉంది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా…కొద్ది నెలల క్రితం తన ప్రాణాలకు శత్రువుల నుంచి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని నాగరాజు పోలీసులను కోరాడు. అందుకుపోలీసులు నిరాకరించినట్లు తెలిసింది.