గుప్త నిధులకోసం 5 నెలల పసికందు బలి ఇచ్చే ప్రయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇంటి వెనుక ఉన్న గుప్త నిధులు తవ్వి తీయటానికి 5 నెలల పసికందును బలి ఇవ్వమని చెప్పాడు ఓ మంత్రగాడు. సమయానికి అదంతా బూటకమని ఒక వ్యక్తి అడ్డుపడటంతో చిన్నారి ప్రాణాలతో బతికి పోయింది.తమిళనాడులోని తిరునల్వేలిలో ఒక కుటుంబం సొంత ఇల్లు కట్టకోవాలనుకుంది. పనులు సక్రమంగా సాగటానికి, త్వరగా ఇల్లు పూర్తవటానికి వారు కిరణ్ రాజన్ అనే మంత్రగాడిని కలిశారు. వారు చెప్పిన స్ధలంలో గుప్తనిధులు ఉన్నాయని అవి తవ్వి తీస్తే మీకు డబ్బుకు డబ్బు, ఇల్లు సమకూరతాయని తన దివ్య దృష్టితో ఆ మంత్రగాడు చెప్పాడు.

అది నమ్మిన కుటుంబంలోని వారు అతడికి రూ.3 లక్షల 20 వేలు ఇచ్చారు.
తాగుబోతు అయిన కిరణ్ రాజన్ ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసుకున్నాడు. ఎన్నాళ్ళైనా నిధి తవ్వి తీయకపోవటంతో ఆ కుటుంబంలోని పార్వతి అనే మహిళ మంత్రగాడిని ప్రశ్నించింది. పూజలు పూర్తయ్యాయని అమ్మవారికి పిల్లిని, కోడి పెట్టను బలి ఇస్తే నిధి త్వరగా దొరుకుతుందని నమ్మబలికాడు.అది నమ్మిన పార్వతి తన ఇంట్లో అందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రగాడు  కిరణ్ పార్వతి ఇంటికి వచ్చి బలి పూజా కార్యక్రమం మొదలెట్టాడు. మంత్రగాడు ఇంట్లో ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమానికి సిధ్ధం అవుతుండగా …బలి కోసం తీసుకు వచ్చిన పిల్లి పారిపోయింది. అమ్మవారికి తగిన విధంగా శాంతి జరగటంలేదని భావించిందని..అందుకే పిల్లి పారిపోయిందని చెప్పాడు.

మరింత ఎక్కువ స్ధాయిలో అమ్మవారికి బలి ఇవ్వాలన్నాడు. పసికందును బలి ఇస్తే వెంటనే నిధి దొరుకుతుందని చెప్పాడు. అప్పటికే పార్వతికి 5 నెలల మనవరాలు ఉంది. పసికందును బలి ఇవ్వటానికి పార్వతి సిధ్దమయ్యింది. మంగళవారం ఆగస్టు4వ తేదీ వస్తానని… ఈలోగా ఏర్పాట్లు చేయమని చెప్పి వెళ్లిపోయాడు. పార్వతి కుటుంబ సభ్యులు అందుకు ఏర్పాట్లు చేయటం ప్రారంభించారు.మంగళవారం నాడు వారింటికి ఒక బంధువు వచ్చాడు. ఇంట్లో ఏర్పాట్లు చూసి షాకయ్యాడు. మంత్రగాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పి వారి ప్రయత్నాలను ఆపించాడు. మంత్రగాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంత్రగాడు కిరణ్ రాజన్ ను, బలి ఇవ్వటానికి గొయ్యి తవ్విన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts