Home » ఏపీలో కోడి పందాలపై పోలీసులు ఫోకస్…700 కోడి కత్తులు సీజ్, ఫ్యాక్టరీ నిర్వాహకుల అరెస్ట్
Published
2 weeks agoon
Task force Attacks Chicken Swords Factory : ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో కోళ్ల పందాల జోరు మళ్లీ మొదలైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కోడి పందాల కోసం పందెం రాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. కోళ్ల పందాలు అంటే మామూలు కాదు. కొందరు కోళ్ల పందాలు మామూలుగా నిర్వహిస్తారు. మరికొందరు మామూలు కోళ్ల పందాలతో కిక్ ఏముంటుందంటూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తుంటారు.
వారి ఆట కట్టించేందుకు పోలీసులు కోడికత్తుల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కోడికత్తుల తయారీ స్థావరంపై దాడి చేశారు. ఆత్కూరులోని ఓ కర్మాగారంపై దాడులు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు 700 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోడి కత్తుల తయారీ కోసం వినియోగించే సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
కోడి పందాలకు ఫేమస్ అయిన జిల్లాల్లో కూడా ఈ కోడి కత్తుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కోళ్ల కత్తులను తయారు చేస్తున్న సంస్థల నిర్వాహాకులతో పాటు… కోళ్లకు కత్తులు కట్టే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోడి కత్తులకు సంబంధించి 150కి పైగా కేసులు నమోదు చేశామని, అనుమానం ఉన్నవారిపై బైండోవర్ కేసులు పెట్టినట్టు తెలిపారు పోలీసులు.
సంక్రాంతి పండుగకు కోడి పందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పూర్తి నిఘా పెట్టామన్నారు. కత్తులు కట్టకుండా పందేలు ఆడినా నేరమేనని తెలిపారు. పేకాట శిబిరాలు నిర్వహించేవారిని గుర్తించి వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పండుగ సీజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు.