గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య, అర్థరాత్రి కాపు కాసి మర్డర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుంటూరు జిల్లా గురజాల మండలం పాత అంబాపురంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ కార్యకర్త విక్రమ్ ను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. శనివారం(జూన్ 27,2020) అర్ధరాత్రి బైక్‌ పై వెళ్తుండగా కాపు కాసిన ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్‌ తీవ్రగాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఆ కోణంలో మృతుడితో గతంలో గొడవలకు దిగిన పలువురు వ్యక్తుల్ని విచారించే పనిలో పడ్డారు.

బోరు వేసే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ:
ఇంటి దగ్గర బోరు వేసుకునే విషయంలో విక్రమ్ వర్గానికి మరో వర్గానికి వివాదం నెలకొంది. ఈ క్రమంలో అర్ధరాత్రి 15మందితో కాపు కాసి ప్రత్యర్థులు విక్రమ్ వర్గంపై దాడి చేసినట్టు సమాచారం. దాడిలో విక్రమ్ కాలు, చేయి నరికేశారు. తీవ్రగాయాలు కావడంతో విక్రమ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విక్రమ్ ఓ పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు మోహరించారు. గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలువురు టీడీపీ నేతలు ఈ ఘటన గురించి ఆరా తీశారు. విక్రమ్ కుటుంబాన్ని వారు పరిమర్శించారు.

Related Posts