ఒకప్పుడు చక్రం తిప్పారు, ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు.. ప్రశ్నార్థకంగా కొత్తకోట దంపతుల రాజకీయ భవిష్యత్తు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kothakota Dayakar Reddy couple: ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లా అంటే టీడీపీకి పెట్టని కోట. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఆ పార్టీ పత్తా లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ పార్టీని, కేడర్‌ను నమ్ముకొని నెట్టుకొస్తున్నారు కొత్తకోట దంపతులు. కొత్తకోట దయాకర్ రెడ్డి మూడు సార్లు ఎంఎల్ఏగా, ఆయన సతీమణి సీతా దయాకర్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, దేవరకద్ర ఎంఎల్ఏగా వ్యవహరించారు. టీడీపీ కీలక నేతలుగా ఎదిగారు. కొంతకాలం పాటు జిల్లా రాజకీయాలను వారిద్దరూ శాసించారు. అయితే ఆ దంపతులిద్దరి రాజకీయ భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

మరో దారి లేక సొంత పార్టీలోనే ఉండిపోయారు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ బలహీన పడుతూ వచ్చింది. పార్టీలో ఉన్న కీలక నేతలంతా తమ రాజకీయ భవిష్యత్‌ కోసం ఇతర పార్టీలను ఆశ్రయించారు. ఈ దంపతులిద్దరికీ మాత్రం ఏ పార్టీ నుంచి ఆహ్వానం రావడం లేదంటున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లాలనుకున్నా రెండు నియోజకవర్గాలను వీరికి కేటాయించే పరిస్థితి లేదట. దీంతో నమ్ముకున్న సొంత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల ముందు ఆ దంపతుల్లో మాత్రం రాజకీయంగా ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు.

కొత్తకోట దంపతులు ఏ పార్టీలోకి వెళతారు?
అధిష్టానం దగ్గర మెప్పు పొందినా పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేకపోవడంతో ఎటూ తెల్చుకోలేకపోతున్నారట. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరిగినా ఆ పార్టీ అధిష్టానం మాత్రం వారిద్దరికి రెండు నియోజకవర్గాలు కేటాయించేందుకు సిద్ధపడలేదు. దీంతో మక్తల్ నియోజకవర్గం నుంచి మాత్రమే దయాకర్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ నేతల రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. వారిద్దరూ ఎటు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.

నాడు ఘనం, నేడు దయనీయం:
కొత్తకోట దంపతులు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. దాదాపు ఖరారయ్యే సమయానికి మళ్లీ వెనక్కి తగ్గారట. వారి ఉనికి కాపాడుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అయోమయంలో ఎటు అడుగు వేయాలో తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు. తమ అనుచర వర్గాన్ని కాపాడుకునేందుకు నమ్ముకున్న టీడీపీలోనే ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నారని అంటున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ నేతలిద్దరూ ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో కేడర్‌ కూడా ఫీలవుతోందని టాక్‌. చూడాలి మరి కొత్తకోట దంపతుల రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో?

Related Tags :

Related Posts :